Thursday, May 2, 2024

కృష్ణమ్మ పరవళ్ళు.. నిండుకుండల్లా జలాశయాలు, ప్రకాశం బ్యారేజ్‌ వద్ద అప్రమత్తం

అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎగువ నుంచి శ్రీశైలంకు ఇన్‌ ఫ్లో రూపంలో 3,95,652 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 4,52,540 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 884.71 అడుగుల వరకు స్థిరంగా ఉంచి మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామ్యర్దమైన 215.81 టీఎంసీలకు గాను 213.92 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. శ్రీశైలం దిగువన నాగార్జున సాగర్‌ కూడా పొంగి పొర్లుతోంది. 312 టీఎంసీల పూర్తిస్థాయి సామర్ద్యానికి గాను 311.15 టీఎంసీలను స్థిరంగా ఉంచి మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సాగర్‌కు 4,25,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి దిగువకు భారీగా విడుదల చేస్తున్న నీటి వల్ల దిగువన పులిచింతలపై వత్తిడి పెరుగుతోంది. పులిచింతలకు ఎగువ నుంచి 3,87,063 క్యూసెక్కుల నీరు ఇన్‌ ఫ్లో రూపంలో వచ్చి చేరుతుండగా శుక్రవారం రాత్రి దిగువకు విడుదల చేస్తున్న అవుట్‌ ఫ్లో 4,34,066 క్యూసెక్కులుగా నమోదయింది. 45.77 టీఎంసీల గరిష్ట నీటి సామర్ద్యానికి గాను 40.44 టీఎంసీల నీటిని స్థిరంగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న నీటిని ఎప్పటికపుడు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద అప్రమత్తం

- Advertisement -

కృష్ణా బేసిన్‌కు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3.07 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్దంతో జలకళ సంతరించుకున్న ప్రకాశం బ్యారేజ్‌ నుంచి అదనంగా వచ్చి చేరుతున్న నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ లో 57.05 అడుగుల వరకు నీరు చేరుకోగా శుక్రవారం రాత్రికి ఎగువ నుంచి వచ్చే వరద జలాల ఇన్‌ ఫ్లో 2,96,561 క్యూసెక్కులుగా నమోదయింది. ఎగువ నుంచి బ్యారేజ్‌ కు వచ్చి చేరుతున్న నీటిని యధాతధంగా దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న క్రమంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు జలవనరుల శాఖ అధికారులు కోరుతున్నారు. నదిలో స్నానాలు చేయద్దు.. పశువులను మేపేందుకు వెళ్లవద్దు.. నదిలో చేపల వేటకు రావద్దని హెచ్చరించారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు వరద జలాలు తోడు కావటం వల్ల మరో రెండు మూడు రోజుల పాటు ప్రకాశం బ్యారేజ్‌లో ఇదే ఉధృతి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. మరో వైపు కృష్ణా పరవళ్ళు తొక్కుతుండటంతో రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కృష్ణా పరిధిలోని 108 రిజర్వాయర్లలో 869.57 టీఎంసీల గరిష్ట సామర్ద్యానికి గాను 88.4 శాతం నీటి నిల్వలు అందుబాటులోకి వచ్చాయి. ఖరీప్‌ తో పాటు రబీకి సైతం ఢోకా లేకుండా సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చాయనీ, ఇపుడున్న నిల్వలతో డిసెంబరు నుంచి మొదలయ్యే తాగునీటి కొరతను కూడా ఎదుర్కోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement