Tuesday, April 30, 2024

అమెజాన్ కు జెఫ్ బెజోస్కు భారీ షాక్.. ఒక్కరోజులో 20.5బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి..

అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలో 20.5బిలియన్‌ డాలర్లు (రూ.1.56లక్షలకోట్లు) ఆవిరైపోయింది. శుక్రవారం కంపెనీ షేర్లు భారీగా పతనమవడమే దీనికి కారణం. అమెజాన్‌ షేరు గత సెషన్‌లో 14.05శాతం పడిపోయి 2485.63డాలర్లు వద్ద స్థిరపడింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్‌ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. 2015 తర్వాత కంపెనీ తొలిసారి నష్టాల్ని నమోదు చేసింది. కాగా రెండుదశాబ్దాల అనంతరం తొలిసారి విక్రయాల వృద్ధి తగ్గుముఖం పట్టడం విశేషం. జెఫ్‌బెజోస్‌కు అమెజాన్‌లో 11.1శాతం వాటాలున్నాయి. బెజోస్‌ వ్యక్తిగత సంపదలో అధికవాటా అమెజాన్‌ షేర్లదే. అమెరికాలో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం బెజోస్‌ సంపద 148బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే ఆయన ఒక్కరోజులోనే తన సంపదలో 12శాతం క్షీణతను ఎదుర్కొన్నారు. 2022లో ఇప్పటివరకు బెజోస్‌ సంపద 43బిలియన్‌ డాలర్ల మేర తరిగిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో బెజోస్‌ ప్రస్తుతం రెండోస్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో 249బిలియన్‌ డాలర్లతో ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో ఉన్నారు. కానీ బెజోస్‌ ఎదుర్కొన్న ఆర్థికనష్టం కేవలం అంకెలకే పరిమితం. అమెజాన్‌ షేర్లు మళ్లిd పుంజుకుంటే ఆయన సంపద తిరిగి సంఖ్యాపరంగా పెరుగుతుంది. అమెజాన్‌ షేర్ల పతనంతో శుక్రవారం అమెరికా ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన నాస్టాక్‌ సూచీసైతం భారీగా దిగజారింది.

త్రైమాసిక ఫలితాల్లో 3.84బిలియన్‌ డాలర్ల నష్టం..

మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను అమెజాన్‌ ప్రకటించింది. 3.84బిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇతే త్రైమాసికంలో 8.1బిలియన్‌ డాలర్ల లాభాలను నివేదించింది. రివియాన్‌ మోటివ్‌ స్టాక్స్‌లో అమెజాన్‌ పెట్టుబడి 7.6బిలియన్‌ డాలర్ల నష్టాలకు కారణమైంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్‌ 1.28బిలియన్‌ డాలర్ల ఆపరేటింగ్‌ నష్టాల్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి త్రైమాసికంలో అమెజాన్‌ నష్టాలను ఎదుర్కొంది. కరోనా సంక్షోభ సమయంలో ఈ-కామర్స్‌ భారీగా పుంజుకుంది. దీంతో అమెజాన్‌ తమ కార్యకలాపాలను వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా విస్తరించింది. కొత్త గిడ్డంగులను, స్టోర్లను నిర్మించింది. క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రజల ఆన్‌లైన్‌ షాపింగ్‌ తగ్గటంతో అమెజాన్‌ ఆదాయం నెమ్మదించింది. ఇంధన ధరలు పెరగడంతో రవాణా వ్యయం సైతం భారంగా మారింది. ద్రవ్యోల్బణం పెరగడంతో ఖర్చులు రెండు బిలియన్‌ డాలర్ల మేరకు పెరిగాయని అమెజాన్‌ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement