Sunday, May 5, 2024

70 లక్షల మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు.. పెరుగుతున్న కొత్త ఇన్వెస్టర్లు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల వద్ద 70 లక్షల కొత్త ఖాతాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాల సంఖ్య 13.65 కోట్లకు పెరిగాయి. ప్రధానంగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి రావడం, ఫండ్లపై అవగాహన పెరగడం వల్లే ఖాతాలు భారీగా నమోదవడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా లెక్కల ప్రకారం 2021-22లో కొత్తగా 3.17 కోట్లు, 2020-21లో 81 లక్షల ఖాతాలు నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్‌లోకి కొత్త ఇన్వెస్టర్లు ఎక్కువ సంఖ్యలో ప్రవేశిస్తున్నారనడానికి అధికంగా నమోదైన ఖాతాలే నిదర్శమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

కరోనా ప్రభావంతో చాలా మంది సేవింగ్స్‌ను మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడుతున్నారు. దీని వల్లే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు స్టాక్‌ మార్కెట్‌లోనూ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య సైతం గణనీయంగా పెరిగాయి. స్టాక్‌మార్కెట్లు ఎక్కువ కాలం లాభాల్లో ట్రేడవుతుండటం వల్ల కూడా యువత ఎక్కువగా స్టాక్స్‌లోనూ, మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. స్టాక్‌మార్క్‌ట్‌లో షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిస్క్‌ ఫ్యాక్టర్‌ తక్కువగా ఉండటం వల్లే సురక్షిత పెట్టుబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివిద ఫండ్‌ హౌస్‌ల వద్ద 2022 ఆగస్టు నాటికి 13.65 కోట్ల మ్యూచువల్‌ ఖాతాలు ఉన్నాయి. 2022 మార్చిలో వీటి సంఖ్య 12.95 కోట్లుగా ఉన్నాయి. మే 2021లో 10 కోట్ల మైలురాయిని దాటాయి. కరోనా తరువాత మార్కెట్లు పుంజుకోవడంతో చాలా మంది ఇన్వెస్టర్లు మంచి లాభాలను పొందారు. దీంతో కొత్తగా ఈక్విటీ మార్కెట్‌లోకి ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మార్కెట్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022 మార్చిలో మొత్తం ఇన్వెస్టర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 55.2 శాతంగా ఉంది. ఇది ఆగస్టు నాటికి వీరి సంఖ్య 56.6 శాతానికి పెరిగింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు పెరగడం సాధారణ వ్యక్తులు తమ సేవింగ్స్‌ను మార్కెట్‌లో పెట్టుబడులుగా మార్చుకుంటున్నారడానికి నిదర్శనం. ఆగస్టులో రిటైల్‌ ఇన్వెస్టర్లు 10.85 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలను కలిగి ఉంటున్నారు. 2016-17 నుంచి క్రమంగా ఇన్వెస్టర్ల ఖాతాలు పెరుగుతూ వస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రస్తుతం 39.5 లక్షల కోట్ల ఎసెట్స్‌ను నిర్వహిస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో మహారాష్ట్ర నిలిచింది. తరువాత గుజరాత్‌, కర్నాటకలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement