Friday, April 26, 2024

మరోసారి వడ్డీరేట్లు పెంచనున్న ఆర్బీఐ.. ఈ నెల 28న ద్రవ్య విధాన కమిటీ భేటీ

ఆర్థిక మాంద్యం ముంచుకు వస్తుందన్న భయాల నడుమ మరోసారి రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోవడం, అమెరికా ఫెడ్‌ రేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచడం కూడా ఒక కారణం. అమెరికా బాటలోనే అనేక దేశాల కేంద్ర బ్యాంక్‌లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. ఆర్బీఐ కూడా ఇదే బాటలో మరోసారి 50 బేసిస్‌ పాయింట్ల మేరకు రెపోరేట్‌ను పెంచవచ్చని భావిస్తున్నారు. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఇది మరింత పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేశారు. అమెరికా ఫెడ్‌ రేట్లు పెంచిన సందర్భంగా కేంద్ర ఛైర్మన్‌ చేసిన హెచ్చరిక ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా ఆర్ధిక మాంద్యంలోకి జారుకోదని చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. దీని ప్రభావం తప్పనిసరిగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలపై ఉంటుంది.
ఆర్బీఐ మే నెల నుంచి ఇప్పటి రకు మూడు సార్లు వడ్డీరేట్లను సవరించింది. మూడు సమావేశాల్లో ఇప్పటి వరకు 140 బేసిస్‌ పాయింట్ల మేర రెపోరేట్‌ను పెంచింది.

28న కమిటీ సమావేశం..

మరోసారి ఈ నెల 28న మరోసారి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం కానుంది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షత జరిగే ఈ సమావేశం మూడు రోజుల పాటు ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి అంశాలపై చర్చిస్తుంది. శుక్రవారం 30వ తేదీన సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ ప్రకటిస్తారు. గత సమావేశంలో పెంచినట్లుగానే ఈసారి కూడా 50 బేసిస్‌ పాయింట్ల మేర రెపోరేట్‌ పెంచే సూచనలు ఉన్నాయి. దీంతో వడ్డీరేటు మూడు సంవత్సరాల గరిష్టానికి 5.9 శాతానికి పెరగనున్నాయి. ఆర్బీఐ ఈ సంవత్సరం మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లు, జూన్‌, ఆగస్టులో 50 బేసిస్‌ పాయింట్ల చొప్పున రెపోరేట్‌ను పెంచింది. రెపోరేట్‌ పెంచేందుకు ఆర్బీఐ కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది.

అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ 75 బేసిస్‌ పాయింట్లు..

- Advertisement -

రెపోరేట్‌ పెంచింది. ఇదే బాటలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ సైతం వడ్డీరేట్లను పెంచాయి.
ప్రస్తుతం రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతంగా నమోదైంది. సమీప భవిష్యత్‌లో ఇది ఆర్బీఐ లక్ష్యం మేర తగ్గే సూచనలు కనిపించడంలేని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనామిస్ట్‌ మదన్‌ సబన్వేష్‌ అభిప్రాయపడ్డారు. అందు వల్ల ఆర్బీఐ 25-35 బేసిస్‌ పాయింట్ల పెంచడం గురించి కాకుండా, 50 బేసిస్‌ పాయింట్ల పెంచడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని కనీసం 4 నుంచి 6 శాతం మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement