Monday, May 6, 2024

శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ కి లేఖ రాసిన RRR..

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఎం జగన్‌కు తాజాగా మరో లేఖ రాశారు. 2020 జనవరి 27న శాసనసభలో చేసిన తీర్మానానికి కట్టుబడుతూ.. శాసనమండలిని వెంటనే సమావేశపరిచి, మండలి రద్దుకు తీర్మానించాలని కోరారు. మండలిలో వైసీపీకి మెజార్టీ వచ్చిన నేపథ్యంలో సీఎంకు అభినందనలు తెలిపారు. అయితే, మండలిలో మెజార్టీ వచ్చినప్పటికీ, గతంలో శాసనసభ సాక్షిగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న లక్ష్యంతో శాసనమండలిలో ప్రవేశ పెట్టిన బిల్లుకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఆనాడు ఏకంగా మండలినే రద్దు చేయాలని నిర్ణయించి, శాసనసభలో తీర్మానించారని గుర్తు చేశారు. శాసనమండలిని మరికొంత కాలం కొనసాగిస్తే, మెజారిటీ  వస్తుందని తెలిసినా మండలి రద్దుకు తీర్మానించారని పేర్కొన్నారు.

‘‘మండలి వల్ల ప్రజాధనం వృథా” అవుతోందని, ఎంతో విలువైన సమయం కోల్పోతున్నామంటూ మీరు శాసనసభలో చెప్పిన విషయాలను చాలా మంది నమ్మలేదు. దీనికి కారణం.. మీకు శాసనమండలిలో బలం లేదు గనుక అలా చెబుతున్నారని అనుకున్నారు అని రఘురామ పేర్కొన్నారు. మీ విలాసాలకు, మీ విమానాలకు 2019 జూన్‌ నుంచి 2020 నవంబరు వరకు సుమారు రూ.26 కోట్లు ఖర్చు చేశారని మీరంటే గిట్టని వారు ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండలిలో మెజారిటీ వచ్చినందున తక్షణమే మండలిని సమావేశపరిచి, ‘రద్దు తీర్మానం’ చేయడం సమంజసమని రఘురామ కృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడంవల్ల ప్రత్యర్థులకు తగిన సమాధానం చెప్పినట్లు అవుతుంది’’ అని రఘురామ సూచించారు. 2020 సెప్టెంబరు 14న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీరిచ్చిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, వచ్చే పార్లమెంటు సమావేశాలలో పార్టీ ఎంపీగా మండలి రద్దుకు కృషి చేస్తానని రఘురామరాజు లేఖలో పేర్కొన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement