Tuesday, May 14, 2024

చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు: వాసిరెడ్డి పద్మ

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విచారణకు రానందున వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని చెప్పారు. బాధిత మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పేందుకే చంద్రబాబు, బొండా ఉమకు నోటీసులు ఇచ్చామని అన్నారు. విచారణకు రాకపోవడంతో వారిపై చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలో చెప్పాలనుకున్నామని పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ధర్నాలు, ఆందోళనలకు సరికాదని చెప్పారు. బాధితురాలిని పరామర్శించటానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా తాను వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వందలాది మంది అనుచరులతో వచ్చి, తన విధులకు ఆటంకం కలిగిస్తూ అడ్డుకొని, బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. చంద్రబాబు, బోండా ఉమాపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement