Wednesday, May 8, 2024

ఆయిల్‌ పామ్‌ ధరలకు రెక్కలు.. ఆరునెలల్లో టన్నుకు 8 వేల పెంపు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆయిల్‌ పామ్‌ ధరలు రైతులకు లాభాల రుచి చూపిస్తున్నాయి. ఆరునెలల క్రితం టన్ను రూ 16 వేల తో ప్రారంభమైన ధర ఇపుడు సుమారు రూ 23 వేలకు చేరింది. ధరలు ఈ స్థాయిలో అనూహ్యంగా పెరగటం ఇదే తొలిసారని ఆయి పామ్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అటు ప్రాసెసింగ్‌ కంపెనీలు, రైతులతో చర్చించి కనిష్ట ధరను ప్రభుత్వం గతంలో రూ 16,400 గా నిర్ణయించింది. ఇపుడు బహిరంగ మార్కెట్‌ లో ధరలు పెరగటంతో ముందుగా నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో (ఓఈఆర్‌) ఆధారంగా టన్ను ధరను ప్రభుత్వం రూ 22,770 గా ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెల్లోకి వస్తున్న ఆయిల్‌ పామ్‌ తాజా గెలలన్నిటినీ టన్ను రూ 22,770 చొప్పున కొనుగోలు చేయాలని ఏపీ ఉద్యానవనశాఖ పామాయిల్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ కు ఉన్న డిమాండ్‌, సగటు ధరల ఆధారంగా ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీలు, రైతు సంఘాల ప్రతినిధులతో ఏర్పడే అడహాక్‌ కమిటీ ఓఈఆర్‌ ను నిర్దారిస్తుంది. ఓఈఆర్‌ ప్రకారమే ఎప్పటికపుడు ధరల్లో హెచ్చుతగ్గులుండాలన్న ఒప్పందం ఉంది. గతంలో తెలంగాణ కన్నా ఏపీ ఓఈఆర్‌ ను తక్కువగా చూపించి ధరల్లో కోతలు పెట్టటంతో రైతులు నష్టపోవటంతో ఇపుడు ప్రభుత్వం ఎప్పటికపుడు పర్యవేక్షణ చేస్తూ పామాయిల్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఫలితంగా కేవలం ఆరునెలల సమయంలోనే ఆయిల్‌ పామ్‌ టన్నుకు రూ 6.5 నుంచి రూ 8 వేల ధర పెరగటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగుకు రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ఎకరాకు సగటు-న 10 టన్నుల దిగుబడి వస్తుండగా ఇపుడున్న ధరల ప్రకారం రూ 2 లక్షల మేర లాభం వస్తున్నట్టు- అంచనా. గత ఏడాది నవంబరులో మార్కెట్‌ సీజన్‌ ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి ధరలు క్రమేపీ పెరుగుతూ టన్ను రూ 16 వేల నుంచి 23 వేలకు చేరింది. రాష్ట్రంలో సుమారు 3.6 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగవుతుండగా ప్రతి ఏటా విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది 2021-22లో కొత్తగా సుమారు 12 వేల హెక్టార్లలో సాగవుగా..ఈ ఏడాది 2022-23లో కొత్త సాగు విస్తీర్ణం 20 వేల హెక్టార్లకు చేరువయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. దిగుబడి సైతం గత ఏడాది 2021-22లో 17.22 లక్షల టన్నులు రాగా..ఈ ఏడాది 2022-23లో 21 లక్షల టన్నులు రావచ్చని అంచనా. ఈ మేరకు ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా పెంచేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం గంటకు సుమారు 450 టన్నుల సామర్దంతో ఆయిల్‌ తీసే 13 పామాయిల్‌ పామాయిల్‌ కంపెనీలున్నాయి. పామాయిల్‌ సాగు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పేందుకు పామాయిల్‌ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement