Wednesday, May 8, 2024

పోరాడతారా, పారిపోతారా.. కేసీయార్‌ కు ఉన్న ధైర్యం లేకపోయింది: టీడీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంపై పోరాడతారో.. లేక పారిపోతారో తేల్చుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి తెలుగుదేశం ఎంపీలు వ్యాఖ్యానించారు. బడ్జెట్ అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా చేతకావడం లేదని మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రం ఆశించి, భంగపడుతూనే ఉందని, ఇప్పుడు కూడా అదే జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ బడ్జెట్ తీవ్ర నిరాశాజనకమని అన్నారు. రాష్ట్రాలకు GSDPలో 4% వరకు రుణ పరిమితికి అవకాశమిస్తూనే, విద్యుత్ రంగం కోసం 1% ఖర్చు చేయాలన్న నిబంధనలు, షరతులు విధించారని కనకమేడల అన్నారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, అది కూడా పూర్తి చేయలేదని తెలిపారు. పీఎం గతి శక్తి పేరుతో మల్టిమోడల్ ట్రాన్స్‌పోర్ట్ మౌలిక వసతుల కల్పన గురించి కేంద్ర మంత్రి ప్రస్తావించారని, గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ఆలోచన అంటూ గుర్తుచేశారు. నదుల అనుసంధానం గురించి మాట్లాడినా, నదీ జలాల వాటాల విషయంలో స్పష్టతనివ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం కొనసాగించడాన్ని ఆహ్వానించారు. రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల ఆర్ధిక సహాయం అంశాన్ని కూడా ఆయన ఆహ్వానించారు. డిజిటల్ అసెట్స్ మీద పన్ను 30% పన్ను అనేది చాలా ఎక్కువ అని, ఇంత మొత్తంలో పన్ను వేయడం సరికాదని గల్లా అభిప్రాయపడ్డారు.

లాలూచీపడ్డారు – అందుకే పోరాడ్డం లేదు: కనకమేడల

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని మరో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. బడ్జెట్లో ఏపీకి కేటాయింపుల కోసం రాష్ట్రం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసిందనేది తెలియాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ల గురించి కమిటీ వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని అన్నారు. బడ్జెట్ మీద వైఎస్సార్సీపీ ఎంపీల స్పందన బాధ్యతారహిత్యంగా ఉందన్నారు. రాష్ట్రానికి ఏం కావాలన్న ప్రణాళిక ఏదీ కనిపించలేదని విమర్శించారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని చెబుతున్నారు తప్ప కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల హక్కులు, ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. మెడలు వంచుతాం అన్నవారే కేంద్రం ముందు మెడలు వంచి, పూర్తిగా లాలూచిపడ్డారని విమర్శించారు.

ఇంత జరిగినా, ఇప్పటికీ ఆశాజనకంగా ఉన్నాం అంటూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని కనకమేడల మండిపడ్డారు. అందుకే పోరాటానికి కూడా సిద్ధంగా లేరని ఆరోపించారు. పక్కనే ఉన్న తెలంగాణలో సీఎం కేసీయార్ కేంద్రాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని, ఆయనకున్నపాటి ధైర్యం కూడా జగన్‌కు లేకపోయిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పోరాడతారా లేక పారిపోతారా అంటూ నిలదీశారు.

- Advertisement -

హక్కుల కోసం కాదు, అప్పుల కోసం పోరాటం: కే. రామ్మోహన్ నాయుడు
వైస్సార్సీపీ నేతల తీరు చూస్తుంటే, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి పోరాడకుండా రుణ పరిమితి పెంచాలంటూ పోరాడుతున్నట్టుగా కనిపిస్తోందని టీడీపీ ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. అందుకే రుణ పరిమితి విషయంలో కేంద్రానికో రూలు, రాష్ట్రాలకు మరో రూలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారని, కానీ విభజన హామీల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని బురదజల్లుతూ అధికారంలోకి వచ్చిన జగన్, సీఎం అయ్యాక ఏం చేశారని నిలదీశారు. విభజన హామీల్లో ఏ ఒక్క అంశం గురించైనా నిలదీశారా అంటూ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జగన్ కేసుల మాఫీ కోసమే పనిచేస్తుంది తప్ప మరేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే, తెలంగాణలో ముఖ్యమంత్రే స్వయంగా బయటకొచ్చి మరీ మాట్లాడుతున్నారని, కానీ జగన్ కనీసం ఒక స్టేట్ మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. జైలుకు పంపుతారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్నారని, కనీసం రాజధాని ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement