Saturday, May 4, 2024

విశాఖ శారదాపీఠం రాజకీయ సంబంధీకమే : స్వామి స్వరూపానందేంద్ర

తిరుపతి (రాయలసీమ ప్రభ బ్యూరో) : అమ్మవారు రాజా శ్యామలగా కొలువై ఉన్నందున విశాఖ శారదా పీఠం రాజకీయ వర్గీయులతో సంబంధం కలిగి ఉంటుందని ఆ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు. తిరుపతిలో శుక్రవారం కంచి కామకోటి పీఠాధిపతి స్వామి విజయేంద్ర సరస్వతి నేతృత్వంలో శతాబ్దాల చరిత్ర కలిగిన తాతయ్య గుంట గంగమ్మ దేవాలయ మహాకుంభాభిషేకం జరిగింది. తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అవుతున్న స్వామి స్వరూపానందేంద్ర గంగమ్మ తొలిదర్శనం చేసుకోడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గంగమ్మ గుడి సందర్శనం తన పర్యటనలో లేదని, కేవలం గంగమ్మవారి కృప వల్లనే వచ్చి దర్శించుకోగలిగానన్నారు. విశాఖ శారదా పీఠంలో రాజసమూర్తిగా అమ్మవారు రాజశ్యామలగా కొలువై ఉన్నందున మంత్రులు, ముఖ్యమంత్రులు రావడం పరిపాటి అన్నారు.

తొలి నుంచి పీవీ నరసింహారావు, ద్రోణంరాజు సత్యనరనారాయణ, టీ సుబ్బిరామిరెడ్డి వంటి ప్రముఖులు తమ పీఠానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందేవారన్నారు. ఆ విధంగా విశాఖ శారదా పీఠంతో రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధాలు ఉండేవని, అదెవరూ కాదనలేరన్నారు. రాజకీయవేత్తలు పీఠానికి వస్తుంటారే కానీ పీఠాధిపతులు రాజకీయవేత్తల వద్దకు వెళ్లడం ఉండదన్నారు. అలాగే రాజకీయవేత్తల మాటలు కూడా తానూ విననని అంటూ ఒకప్పుడు టి టి డి చైర్మన్ గా దళిత గోవిందం వంటి అద్భుతమైన కార్యక్రమాలను నిర్వచించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట మాత్రం వింటానని స్వామి స్వరూపానందేంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement