Tuesday, May 7, 2024

విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో ఇప్పటికీ…’ప్రత్యేక’ పాలనే..!

విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర‌పాల‌క సంస్థ పాల‌న మిగ‌తా న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ప‌రిపాల‌నకు భిన్నంగా ఉంటుంది.దీనికి కార‌ణం పాలనా వ్యవహారాలతో 90 శాతం మంది కార్పొరేటర్లకు సంబంధం లేకుండాపోయిందన్న చర్చలు బాహాటంగానే సాగుతున్నాయి.
విజయనగరం నగరపాలక సంస్థ అందుకు తగ్గట్టుగానే ఒకప్పటి ప్రత్యేక అధికారుల పాలనకు..నేటి ‘ప్రత్యేక'(పాలకవర్గంలో భాగస్వాములైన కార్పొరేటర్ల పాత్ర ఇసుమంతైనా లేకుండా సాగుతున్న) పాలనకు..పెద్ద తేడా ఏమీ లేదని పలువురు కార్పొరేటర్లే వాపోతున్న పరిస్థితి. తమ డివిజన్‌ పరిధిలో నెలొకొన్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి కూడా అతీగతీ లేకపోయిందన్నది వారి వాదన..వేదన.

      అభివృద్ధి సంగతి పక్కన బెడితే, కనీసం పౌర సేవలు అందించే విషయంలో కూడా తమ సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకున్న నాధుడు లేకపోయాడని 40 మందికి పైగా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లుగా తమని గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని చాలా మంది లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా కక్కలేక..మింగలేక..కాలం నెట్టుకొస్తున్న కార్పొరేటర్లు వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే సాహసం కూడా చేయలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

      విచిత్రమేమిటంటే అధికారుల వద్ద కూడా మాట చెల్లకపోవడంతో చాలా మంది కార్పొరేటర్లు మొక్కుబడిగా సాగే కౌన్సిల్‌ సమావేశాలకు అనివార్యంగా హాజరవుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు తమను గెలిపించిన ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. డివిజన్‌ పరిధిలో నెలకొన్న సమస్యలకు అధికారుల వద్ద పరిష్కారం దొరకక.. కౌన్సిల్‌ సమావేశం వేదికగా వారిని నిలదీసే అవకాశం లేక..మిన్నకుండిపోవడమే అధికార పార్టీ కార్పొరేటర్ల వంతయ్యిందన్నది నిర్వివాదాంశం.

అదలా వుంచితే…నగరపాలక సంస్థ పాలనకే అతీగతీ లేదంటే వార్డు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలు ఆయా విభాగాల్లో అక్రమాల రారాజులుగా వెలుగొందుతున్నవారు చూడడం నగర ప్రజల దురదృష్టంగా చెప్పవచ్చు. అందుకే వార్డు సచివాలయ ఉద్యోగుల్లో చాలా మంది ‘బయోమెట్రిక్‌ హాజరు’తోనే విధి నిర్వహణను మమ అనిపించేస్తున్న పరిస్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement