Sunday, May 19, 2024

పెట్రో బాదుడు : పెరిగిన ఊబ‌ర్ ఛార్జీలు

గ‌త‌ మార్చి 22వ‌తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకు పెర‌గ‌డ‌మే త‌ప్ప‌.. త‌గ్గ‌డం లేదు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో తెలంగాణ‌లో బ‌స్సు ఛార్జీలు ఇప్ప‌టికే రెండు సార్లు పెరిగాయి. ఇక క్యాబ్‌ల్లో ప్ర‌యాణం కూడా ఖ‌రీదైన వ్య‌వ‌హారంలా మారుతోంది. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో క్యాబ్‌ల చార్జీలు మోతెక్కుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల్లో క్యాబ్ చార్జీల‌ను పెంచిన ఊబ‌ర్ తాజాగా ఢిల్లీలో ఇంధ‌న ధ‌ర‌ల భారంతో చార్జీలు 12 శాతం పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. పెట్రో సెగ‌ల‌తో డ్రైవ‌ర్ల డిమాండ్ల‌కు త‌లొగ్గి ఊబ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో చార్జీలు పెంచాల‌ని డ్రైవ‌ర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ అందింద‌ని, ఇంధ‌న ధ‌ర‌ల భారం నుంచి డ్రైవ‌ర్ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు ఢిల్లీ, జాతీయ రాజ‌ధాని ప్రాంతంలో క్యాబ్ చార్జీల‌ను 12 శాతం పెంచామ‌ని ఊబ‌ర్ ఇండియా ఆప‌రేష‌న్స్ హెడ్ నితిష్ భూష‌ణ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇక రాబోయే వారాల్లో ఇంధ‌న ధ‌ర‌ల క‌ద‌లిక‌ల ఆధారంగా త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. ఇక ఇంధ‌న ధ‌ర‌లు ఎగ‌బాకుతుండ‌టంతో ఊబ‌ర్‌, ఓలా డ్రైవ‌ర్లు హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్ స‌హా ప‌లు న‌గ‌రాల్లో నో ఏసీ విధానాన్ని అవ‌లంభిస్తున్నారు. ఏసీ వేసినందుకు డ్రైవ‌ర్లు అద‌నంగా డిమాండ్ చేస్తున్నార‌నే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement