Saturday, May 4, 2024

ఎవ్వరూ బయపడకండి… వేదపాఠశాలలో వైవి

తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం తనిఖీలు చేశారు. కొందరు విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో ఆయన పాఠశాల లోని అన్ని విభాగాలు పరిశీలించారు. విద్యార్థులు కరోనా బారిన పడటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 మంది విద్యార్థులు, ఒక అధ్యాపకుడికి కరోనా సోకిందని,ఎవరికీ లక్షణాలు కనిపించలేదని అధికారులు చైర్మన్ కు తెలిపారు. వేద పాఠశాలలోని భోజనశాలలు, వంటశాల, విద్యార్థుల వసతి గృహాలు, తరగతి గదులు చైర్మన్ పరిశీలించారు సుబ్బారెడ్డి. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు మాత్రమే వసతి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ 19 నిబంధనల మేరకు విద్యార్థులు,అధ్యాపకులకు వసతి కల్పించడానికి అవసరమైతే అదనపు గదులు కేటాయించాలని ఎస్టేట్ ఆఫీసర్ విజయ సారథిని సుబ్బారెడ్డి ఆదేశించారు.

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మరుగుదొడ్లు, స్నానాల గదులు తరచూ శుభ్రం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. డైనింగ్ హాల్ లో 2 మీటర్ల దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టాలన్నారు. పరిస్థితులు మామూలు స్థాయికి వచ్చే దాకా డాక్టర్, వైద్య సిబ్బందిని రేయింబవళ్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

వేద పాఠశాలలో కరోనా సోకిన విద్యార్థులందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. వీరందరికీ మెరుగైన చికిత్స జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement