Tuesday, April 30, 2024

FLASH: నేరం చేస్తే పీడీ యాక్ట్.. జీవితాన్ని అంధకారం చేసుకోకండి

తిరుపతి సిటీ: చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి జీవితాన్ని అంధకారమయం చేసుకోవద్దని తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు శనివారం తెలిపారు. తరచుగా దొంగతనాలకు పాల్పడే ఐదుగురు వ్యక్తుల పై జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఆదేశాల మేరకు పి.డి యాక్ట్ కేసు నమోదు కాబడింది అని వివరించారు. వివరాల్లోకి వెళితే. బండి కళ్ళ రత్నరాజు, ఆవుల నరేష్, షేక్ ఫిరోజ్, ఖాదిర్ అహ్మద్, సందీప్ కుమార్ అనే ఐదుగురు యువకులు తరచుగా దొంగతనాలకు పాల్పడ్డుతున్నారు. గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించినా.. దొంగతనాలు మాత్రం కొనసాగిస్తునే ఉన్నారు. వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ ఈ అయిదుగురి పై పి.డి యాక్ట్ కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ అనుమతితో వీరిపై కేసు నమోదు చేశారు.

కాగా, పి.డి యాక్ట్ కింద కేసు నమోదు అయితే, సంబంధిత నేరస్థుడికి సంవత్సరం పాటు బెయిల్ దొరకదు. సబ్ జైల్లో అనుభవిస్తున్న సాధారణ జైలు శిక్ష నుండి కఠినమైన కారాగారశిక్ష నిమిత్తం సెంట్రల్ జైలుకు తరలిస్తారు. కేవలం నేరం చేసిన వారి యొక్క ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి మాత్రమే తరచుగా నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తారు. ఈ సంవత్సరం కాలంలో వారు అనుభవించిన కఠినమైన కారాగారశిక్ష ద్వారా వారి మానసిక పరివర్తనలో మార్పు వస్తుందని అధికారులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. వివిధ వ్యసనాలకు బానిసై నేరాలకు అలవాటు పడిన వాళ్ళు తమ తప్పును తెలుసుకుని నేరాలకు దూరంగా ఉండాలని లేనిపక్షంలో అటువంటి వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చోరీ కేసుల్లో ఒకటి కన్నా ఎక్కువ నేరాలకు పాల్పడిన వారి వివరాలు సేకరిస్తున్నామని తిరుపతి పోలీసులు తెలిపారు. వారిపై ఉన్న కేసులను పరిశీలించి పిడియాక్ట్ నమోదు చేస్తామని ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement