Wednesday, May 15, 2024

AP: గుండెకింది తడిని స్పృశించేదే అసలైన కవిత్వం.. పి.విజయబాబు

అమరావతి, ఆంధ్ర ప్రభ : గుండెకింది తడిని స్పృశించేదే అసలైన కవిత్వమని, వేగం పెరిగిన నేటి కాలంలో సమాజాన్ని చదివే తీరిక ఎవరికీ ఉండటం లేదని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు అన్నారు. స్థానిక ఠాగూర్ గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్యర్యంలో కొమ్మవరపు విల్సన్ రావు రచించిన ‘నాగలి కూడా ఆయుధమే..’ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిధిగా విజయబాబు హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి మనిషీ పుస్తకాలు చదవడం నేర్చుకోవాలన్నారు. అందుకు గ్రంథాలయాల్ని ఉపయోగించుకోవాలన్నారు.

కనీసం రోజుకు ఒక పేజీ అయినా చదవాలన్నారు. గుండెకింది తడిని స్పృశించే కవిత్వం నేటితరం కవుల నుండి ఆశిస్తున్నానన్నారు. అలాంటి కవిత్వమే సమాజంలో మార్పు తీసుకొస్తుందన్నారు. మహాకవి శ్రీశ్రీ కవిత్వాన్ని మనం ఇప్పటికీ చెప్పుకున్నట్టే ఐదు దశాబ్దాల తర్వాత కూడా మన కవిత్వం గురించి రేపటి తరం చెప్పుకోవాలంటే శ్రీశ్రీ స్థాయిలో కవిత్వం రాయాలని నేటితరం కవులకు సూచించారు. సభకు అధ్యక్షత వహించిన విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ.. కవిత్వం కోసం కుటుంబాన్ని, సమాజాన్ని, వృత్తినీ వదిలేసిన కవులు ఎందరో వున్నారన్నారు. విల్సన్ రావు కవిత్వంలో దళిత విప్లవ అస్థిత్వ వాదాల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయన్నారు. సుప్రసిద్ధ సాహితీవేత్తలు సాగర్ శ్రీరామకవచం, బంగార్రాజు కంఠ, సీనియర్ జర్నలిస్టు ఘంటా విజయ్ కుమార్ సభలో మాట్లాడారు. పుస్తకాన్ని అనిల్ డ్యాని సమీక్షించారు. కొమ్మవరపు విల్సన్ రావు తన స్పందనని తెలియజేశారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమలాపూర్ణమ్మ, గ్రేడ్ వన్ గ్రంథాలయాధికారిణి కె.రమాదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లెతీగ కలిమిశ్రీ తొలుత అతిధుల్ని వేదికపైకి ఆహ్వానించగా కార్యక్రమాన్ని చొప్పా రాఘవేంద్రశేఖర్ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement