Friday, January 27, 2023

మహిళా అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్యంగా.. పఢ్‌నా.. లిఖ్‌నా.. ఫలితమిచ్చేనా..?

విజయనగరం, ప్రభన్యూస్‌ : అక్షరాస్యత.. మానవ జీవితానికి సార్ధకత చేకూర్చుతుందని చెబితే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే కార్యక్రమాల్లో చాలా వరకు లక్ష్యానికి దూరంగా మిగిలిపోయావన్నది కూడా కాదనలేని వాస్తవం. విద్యాభివృద్ధి పేరు చెప్పి కోట్లాది రూపాయిలు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో వుండడం వల్ల వయోజన విద్య.. సాక్షర భారత్‌.. ఇలా పేర్లు ఏవైనా ఆశించిన ఫలితాలు రాబట్టలేని దుస్థితి. విధి నిర్వహణను పక్కన బెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు పలు సొంత వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటు పడిన చాలా మంది ఉపాధ్యాయులు వయోజన విద్య/సాక్షర భారత్‌ ప్రోజెక్ట్‌లను షెల్టర్‌ జోన్‌లుగా వాడుకుంటున్న క్రమం అందరికీ తెలిసిందే.

- Advertisement -
   

ఈనేపథ్యంలో 2021, జూన్‌లో పఢ్‌నా..లిఖ్‌నా..అభియాన్‌ పేరిట మరో కార్యక్రమాన్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో మొట్టమొదటిగా విజయనగరం జిల్లాలోనే ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా తొలివిడతగా జిల్లాలోని 39,336 మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు సంబంధిత విభాగం అధికారులు. విద్య సమాజ వికాసానికి మూలం..నినాదాన్ని నమ్మిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విద్యావంతులుగా మార్చేందుకు కోట్లాది రూపాయిలు వెచ్చిస్తున్న వైనం తెలిసిందే. ఒకవైపు విద్యాభివృద్ధికి భారీ ఎత్తున నిధులను కేటాయిస్తూనే వివిధ కారణాలతో చిన్నప్పుడు చదువుకోలేక, విద్యకు దూరమైనవారి చేత ఓనమాలను దిద్దించేందుకు 2021, జూన్‌లో ప్రకటించిన పఢ్‌నా.. లిఖ్‌నా అభియాన్‌ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తాయి.

ఇది కూడా చదవండి : ఆత్మ‌కూరు ఠాణాపై దాడి ఘ‌ట‌న‌.. అక్క‌డే ఎస్పీ మ‌కాం, 60 మంది అరెస్టు..

విజయనగరం జిల్లాలో అక్షరాస్యత ఇతర జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళా అక్షరాస్యత అయితే మరింత తక్కువ. జిల్లాలో సగటు అక్షరాస్యత 58.89 శాతం కాగా, వీరిలో పురుషుల అక్షరాస్యత 68.15 శాతం, మహిళల అక్షరాస్యత 49.87 శాతం. చిట్టిగురువులు కార్యక్రమం ద్వారా 28,627 మందిని అక్షరాస్యులను చేసినట్లు అప్పట్లో ప్రకటించిన బాధ్యులు ధృవీకరణ పత్రాలను కూడా అందజేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా పఢ్‌నా.. లిఖ్‌నా కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో నవంబర్‌ 19న శ్రీకారం చుట్టారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. అందువల్లే తొలివిడతగా జిల్లాలోని 10 మండలాలకు చెందిన 39,336 మంది మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులను చేయాలని సంక్పలించారు. ఫిబ్రవరి 15 నాటికి తొలివిడత శిక్షణా కార్యక్రమం పూర్తికానుంది. జిల్లాలోనే తక్కువ అక్షరాస్యత వున్న జామి, గంట్యాడ, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, గరివిడి, చీపురుపల్లి, సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలను ఎంపిక చేసి అక్షరాస్యతా కేంద్రాలను ప్రారంభించారు.

వీరికి చదువు చెప్పేందుకు 3,194 మంది వాలంటీర్లను గుర్తించారు. ఆయా గ్రామాల్లోని విద్యావంతులను, మహిళా పొదుపు సంఘాల సభ్యులను వలంటీర్లుగా ఎంపిక చేసి వారికి శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసారు. గ్రామంలోని అనుకూలమై స్థలంలో, అందరికీ ఆమోదయోగ్యమైన సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం వీరికి 72 గంటల పాటు శిక్షణ ఇచ్చి అక్షరాస్యులను చేసేందుకు కృషి చేస్తున్నారు. వీరికి వాచకం, పెన్సిలు, రబ్బరు, మెండరు మొదలగు టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ను పంపిణీ చేసారు. ఈ ప్రతిష్టాత్మక పఢ్‌నా.. లిఖ్‌నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి ప్రత్యేక దృష్టిని సారించగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కోట్ల సుగుణాకరరావు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement