Monday, April 29, 2024

కడప క్వారీ పేలుళ్ల ఘటనకు వారే కారణం: బీ.టెక్.రవి

కడపలో జరిగిన క్వారీ పేలుళ్ల ఘటనలో ప్రభుత్వం అసలు దోషులను వదిలేయాలని చూస్తోందా? అని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టెక్.రవి ప్రశ్నించారు. క్వారీ అసలు లీజుదారుగా వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిభాయి పేరుపై ఉందన్నారు.  2001 నుంచి 2021 వరకు లీజుపరిమితి ఆమె పేరుతోనే ఉందని తెలిపారు. నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పై అనేక కేసులున్నాయన్నారు. గతంలో పీడీయాక్ట్ పై అతను జైలుకెళ్లొచ్చాడని చెప్పారు. అతనికి క్వారీని సబ్ లీజుకిచ్చామని , తమకు సంబంధంలేదని అసలు లీజుదారులు చెబితే, వారిమాట ప్రకారం అధికారులు నడుచుకుంటారా? అని ప్రశ్నించారు. అసలు నాగేశ్వర్ రెడ్డికి క్వారీని సబ్ లీజుకిచ్చారా లేక ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ ఫీజు చెల్లించకుండా క్వారీ నుంచి రూ.100 కోట్ల విలువైన మెటీరియల్ తరలించారని ఆరోపించారు. రామచంద్రయ్య కుటుంబసభ్యుల జోలికి వెళ్లవద్దని అధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏమైనా ఆదేశాలువచ్చాయా? అని ప్రశ్నించారు. కడప క్వారీ పేలుళ్ల ఘటనకు ముమ్మాటికీ సి.రామచంద్రయ్య, ఆయన సతీమణే కారణం అని ఆరోపించారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే, టీడీపీ తరుపున న్యాయస్థానంలో ప్రైవేట్ కేసు వేస్తామని బీ టెక్ రవి చెప్పారు. ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మాదిరే, కడపలో జరిగిన క్వారీ పేలుళ్లలో, రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయినవారికి కూడా రూ.కోటి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.

కాగా, కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాళ్ల క్వారీ (గనుల్లో) పేలుడు ఘటనలో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు  అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పేలుడు సామగ్రి నిర్వహణ, రవాణా లో నిబంధనలు ఉల్లంఘన, పేలుడు పదార్థాలను తరలించడంలో నిబంధనలు అతిక్రమించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఇప్పటికే ఘటనలో భాద్యులైన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా వైఎస్ ప్రతాపరెడ్డిని అరెస్టు చేశారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా పేలుడు సామగ్రి తరలించారని ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement