Tuesday, April 30, 2024

భరతమాత ముద్దుబిడ్డ టంగుటూరి… ధీశాలి ప్రకాశం పంతులు

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఎంతో ఆదర్శనీయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రకాశం పంతులు గారి 152వ జయంతి వేడుకలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో మల్లాది వేంకట సుబ్బారావు సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి – టంగుటూరి స్మారకోపన్యాసం ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ శాఖామాత్యులు ఆదిమూలపు సురేష్, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వళన అనంతరం ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి అకుంటిత ధైర్యసాహసాలు, పోరాట పటిమను భావితరాలకు తెలియజెప్పేలా నిర్వహించిన నాటక ప్రదర్శనలు, గీతాలాపనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాలలో రాణిస్తూనే.. నాటక రంగాన్ని బ్రతికిస్తున్న కళాకారులను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా 1984లో తాను వేసిన నెహ్రూ పాత్రను గుర్తు చేసుకున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు సహా అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు.. ఆనాడు రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు తమ సేవలను కొనసాగించారని ఉండవల్లి చెప్పారు. మహాత్మగాంధీ స్ఫూర్తితో ఆరోజుల్లో రాజకీయ నాయకులందరూ పేదరికాన్ని ప్రేమించి అందులోనే జీవించేవారని.. వావిలాల గోపాలకృష్ణయ్య వంటి వారు అందుకు నిదర్శనమన్నారు. కానీ పేదరికంలో పుట్టిన ప్రకాశం పంతులు న్యాయవాది వృత్తిని విడిచి.. తన ఆర్జనను దేశం కోసం, పేదల కోసం వెచ్చించడం గొప్ప విషయమన్నారు. ఆ మహనీయుని త్యాగాలను, ధైర్య సాహసాలను, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత రాణించాలని ఆకాంక్షించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంధ్రుల పాత్ర ఎంతో ఉందని.. అందులో ఆంధ్రకేసరి ముందు వరుసలో ఉంటారన్నారు. ఆంధ్ర ప్రజల అసమాన త్యాగనిరతికి టంగుటూరి మారుపేరుగా నిలిచారని.. బ్రిటీష్ సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి వారి తుపాకీకి గుండె చూపిన ధీశాలి అని కీర్తించారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేమన్నారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆతి సామాన్య కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. స్వాతంత్ర్య సాధనలో, పాలనదక్షతలో టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో ఆదర్శవంతంగా నిలిచారన్నారు.

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంతో ప్రకాశం పంతులు గారికి విడదీయరాని బంధం ఉందని.. 1952లో భారీ వరదలు వచ్చిన సమయంలో పార్లమెంటులో పోరాడి ప్రభుత్వ నిధులతో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. 1954 న సీఎం హోదాలో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో.. బ్యారేజీకి ఆయన పేరు పెట్టారని తెలిపారు. ఆ మహనీయుని ఆదర్శాలే స్ఫూర్తిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన బాటలోనే పయనిస్తోందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు, కోఆర్టినేటర్లు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement