Monday, May 20, 2024

Karnataka – ప్ర‌జ్వ‌ల్ స్కాండల్ – బిజెపి కూటమికి పెద్ద దెబ్బ‌

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ క‌న్న‌డ నాట సంచ‌ల‌నాత్మ‌క ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. బీజేపీ కూట‌మిని దెబ్బ‌తీసేలా కాంగ్రెస్ పార్టీ స‌రైన స‌మ‌యంలో పెద్ద దెబ్బ కొట్టింది. మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డు ప్ర‌జ్వ‌ల్ సెక్స్ స్కాండల్‌కి పాల్ప‌డ్డ‌ట్టు క‌చ్చిత‌మైన ఆధారాలు ల‌భించాయి. ఆయ‌న ద‌గ్గ‌రున్న రెండు పెన్ డ్రైవ్‌ల‌లో మూడు వేల మంది మ‌హిళ‌లకు సంబంధించిన అశ్లీల వీడియోలు ల‌భించిన‌ట్టు తెలుస్తోంది. ఇవి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసి, సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ కావ‌డంతో ప‌రువు పోతుంద‌ని భావించిన ప్ర‌జ్వ‌ల్ అల‌ర్ట్ అయ్యాడు. వెంట‌నే దేశం విడిచి జ‌ర్మ‌నీ పారిపోయిన‌ట్టు స‌మాచారం. అయితే.. ప్ర‌జ్వ‌ల్ సెక్స్ స్కాండ‌ల్‌కి పాల్ప‌డ్డాడ‌ని, దీనికి సంబంధించిన ఆధారాల‌తో బీజేపీ హై క‌మాండ్‌కి ఏడాది క్రిత‌మే అక్క‌డి పార్టీ అధ్య‌క్షుడు లేఖ ద్వారా వివ‌రించారు. అయినా దాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇప్పుడు బీజేపీకి ఈ స్కాండ‌ల్ మ‌ర‌క అంటుకునే ప్ర‌మాదం ఉంది.

దేవెగౌడ మనవడి పెన్ డ్రైవ్‌లో నీలి వీడియోలు
మూడు వేల మంది మహిళల అశ్లీల స‌మాచారం
హసన్ లోక్‌సభకు ఎన్డీఏ అభ్య‌ర్ధిగా పోటీలో ప్రజ్వల్
వీడియోలు బ‌య‌టికి రావ‌డంతో జర్మనీకి పరార్
ఎన్నికల వేళ వాటిని బ్రహ్మాస్త్రంలా వాడుతున్న‌ కాంగ్రెస్
బీజేపీపై నిప్పులు చెరుగుతున్న విపక్ష నేత‌లు
పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధిత మ‌హిళ‌
దర్యాప్తు కోసం నాలుగు బృందాల ఏర్పాటు
విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న జేడీఎస్‌

- Advertisement -

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన పెన్‌డ్రైవ్‌లో ప్రభుత్వ అధికారులు సహా దాదాపు మూడు వేల మంది మహిళల సెక్స్ వీడియోలు ఉండడం, అవి ఎన్నిక‌ల వేల‌ బయటకు రావడం సంచలనమైంది. తన అరాచకాలు బయటపడిన వెంటనే ప్రజ్వల్ జర్మనీ పారిపోయాడు. తాజాగా, మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బీజేపీ పెద్దలకు ముందే తెలుసన్నది బయటపడింది.

గతేడాది సెప్టెంబర్‌లో ఎన్డీఏలో చేరిక

ప్రజ్వల్ పెన్‌డ్రైవ్‌లో ప్రభుత్వాధికారులు సహా మూడువేల మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నాయంటూ బీజేపీ నేత ఒకరు గతేడాది డిసెంబరులోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాశారు. కర్నాటకలో ఈ నెల 26న‌ తొలిదశ ఎన్నికలు జరగ్గా, అంతకు రెండు రోజుల ముందు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరింది. 33 ఏళ్ల రేవణ్ణ హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

ప్రజ్వల్ అరాచకాలు బీజేపీ అధిష్ఠానం దృష్టికి

గతేడాది డిసెంబర్ 8న బీజేపీ నేత దేవరాజె గౌడ.. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు లేఖ రాస్తూ ప్రజ్వల్ సహా దేవెగౌడ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ పెన్‌‌డ్రైవ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సహా 2,976 మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలిపారు. వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరో పెన్‌డ్రైవ్‌లో మహిళల అశ్లీల చిత్రాలున్నాయని, అవి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. జేడీఎస్‌తో పొత్తుపెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నుంచి జేడీఎస్ అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ వీడియోలు, ఫొటోలను కాంగ్రెస్ ‘బ్రహ్మాస్త్రం’లా ఉపయోగించుకుంటుందని, బీజేపీని రేపిస్ట్ పార్టీగా అభివర్ణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే జాతీయ స్థాయిలో మన పార్టీకి అప్రతిష్ఠ తప్పదని ఆ లేఖ‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

జర్మనీ చెక్కేసిన ప్రజ్వల్

ప్రజ్వల్ వీడియోలు వైరల్ కావడంతో జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ్ తీవ్రంగా స్పందించారు. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ పార్టీ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడకు లేఖ రాశారు. కాగా, వీడియోలు బయటకు రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవణ్ణ విదేశాలకు చెక్కేశారు. నిన్న బెంగళూరులో విమానమెక్కి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ చెక్కేసినట్టు చెప్తున్నారు.

రేవణ్ణే కాదు.. ఆయన తండ్రి కూడా

మరోవైపు, ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రేవణ్ణ ఇంటిలో పనిచేసే 47 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. రేవణ్ణతోపాటు ఆయన తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా హింసించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ పోలీసులు దీనిపై స‌మ‌గ్ర దర్యాప్తు చేస్తున్నారు.

స్టోర్ రూమ్‌కు పిలిచి.. అలా చేసేవాడు

‘‘నేను చేరిన నాలుగు నెలల తర్వాత రేవణ్ణ ఫోన్ చేసి తన గదికి రమ్మనే వాడు. ఇంట్లో ఆరుగురు మహిళలు పనిచేస్తున్నారు. తాము ఇక్కడికి రావడంతోనే భయపడిపోయామని చెప్పారు. ఇంట్లోని మ‌గాళ్లు కూడా త‌మ‌ను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేవారు’’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన భార్య ఇంట్లో లేనప్పుడు తమను స్టోర్‌ రూముకు పిలిచి పండ్లు ఇస్తూ అసభ్యంగా తాకేవాడని ఆ పిటిష‌న్‌లో పేర్కొంది. చీర పిన్‌లు తొలగించి లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిపింది. ప్రజ్వల్ తన కుమార్తెతో ఫోన్‌లో వేధింపుల‌కు దిగితే.. అతడి నంబరును బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.

దర్యాప్తు కోసం నాలుగు బృందాలు

ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ దుమారం రేపుతుండడంతో కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రజ్వల్ పూర్వాపరాలు తెలిసినప్పటికీ, బీజేపీ కార్యకర్తలు లేఖలు రాసినప్పటికీ, ఆయన బాధితులు వేలల్లో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఎక్స్‌లో ప్రజ్వల్‌పై విరుచుకుపడ్డారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్మనీ నుంచి వెనక్కి రప్పించి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అమిత్ షా మౌనంగా ఉండడం తనను షాక్‌కు గురిచేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పార్టీ నుంచి ప్ర‌జ్వ‌ల్ స‌స్పెండ్

హాసన్ సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నేప‌థ్యంలో ఆయ‌న‌ను మంగళవారం జెడిఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే..ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

”ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా..? అవి అతడివేనన్న ఆధారం ఏంటి..? అయినా సరే నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేస్తోందన్న మాజీ సీఎం.. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలన్నారు.
”అసలు ఈ వీడియోల వెనక ఉన్నది ఎవరు? వారు స్త్రీల పరిరక్షకులా? అలాగే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు” అని అన్నారు. ప్రజ్వల్‌పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్టప్రకారం శిక్ష తప్పదని గతంలో వెల్లడించారు. కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన.. భాజపాకు, ప్రధాని మోదీకి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక దేవేగౌడకు, తనకూ ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement