Monday, May 6, 2024

Big Story: బ్రహ్మోత్సవాల్లో గజరాజులు, అశ్వాల రాజసం.. శ్రీ‌వారి వాహన సేవల కోసం ప్రత్యేక శిక్షణ

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలది కీలకపాత్ర. స్వామివారి వాహన సేవల్లో తొలి అడుగు వీటిదే. ఇవే భక్తులకు ముందుగా కనువిందు చేస్తాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ జంతవులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారని సంకేతం ఇస్తాయి. బ్రహ్మోత్సవాలకు అట్టహాసంగా తీసుకువస్తున్న ఘనత వీటికి దక్కుతుంది. తిరుపతిలోని గో సంరక్షణశాలలో వీటి ఆలనాపాలనా చూస్తూ సంరక్షిస్తారు. గజం ఐశ్వర్యానికి చిహ్నం శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీలక్ష్మిదేవి ఇష్టవాహనం కూడా ఏనుగే. అందేవిధంగా శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, సిరి సంపదలకు సూచికలైన ఏనుగులు, ఇతర జంతువులైన గుర్రాలు, వృషభాలతో కలసి మరింత కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను ఇనుమడింప చేస్తున్నాయి.

కేరళ నుంచి వైద్య నిపుణులు రాక
బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ ఇవ్వ‌నున్నారు. మావటీలు తాళ్లు, అంకుశం (ముల్లు కట్టె), గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రించ‌నున్నారు. ఇక్క‌డి సేవ‌ల కోసం వినియోగించే ప‌లు జంతువులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించి అవి హెల్దీగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. అనుకోని ఘటనలు జరిగనప్పుడు జంతువులను నియంత్రించేందుకు త‌గిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. వాహన సేవల్లో పాల్గొనే జంతువులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గజరాజులను ముఖ పట్టాతో పాటు రంగరంగుల బొంతులతో అలంకరిస్తారు. మావటిలు, గొడుగులు, విసనకర్రలతో స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. అలాగే గరుడ సేవనాడు ప్రత్యేకంగా అలంకరిస్తారు. అశ్వాలు రాజసానికి చిహ్నాలు. వీటిని ముఖ పట్టా, తలపై కుచ్చు, బొంతలు, మెడగజ్జలు, కాళ్ల‌ పట్టీలతో అలంకరిస్తారు.

తిరుమలలో గోశాల మరింత అభివృద్ది
తిరుమలలోని ఎస్వీ గోశాలలో పాడి పశువులు, లేగదూడలు, మేలు రకం ఎద్దులతో కలపి మొత్తం కలిపి 45 గోవులున్నాయి. గోశాలకు ఆనుకుని ఉన్న సుమారు 8 ఎక‌రాల స్థలాన్ని చదును చేసి గోవులు తిరిగేందుకు అనువుగా మారుస్తున్నారు. సుమారు 100 గోవులు ఉంచేందుకు వీలుగా షెడ్‌ నిర్మించనున్నారు. శ్రీవారి తోమాల సేవ, అభిషేకం, ఏకాంత సేవ, నవనీతసేవ కోసం పాలు, పెరుగు, వెన్న తదితర పదార్ధాలను ఇక్కడి నుంచే తీసుకెళతారు. మజ్జిగను అన్నదానం కాంప్లెక్సుకు సరఫరా చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement