Saturday, May 4, 2024

ఆక్వారంగం అభివృద్ధికి చేయూత, జాలర్లకు ప్రత్యేక ప్యాకేజీ.. కేంద్రానికి వైసీపీ ఎంపీల బృందం వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశంలోనే అత్యధికంగా ఆక్వా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఆ రంగాభివృద్ధికి చేయూతనందించాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఎంపీలు బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖా మంత్రి పర్షోత్తం రూపాలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరంలో 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతో పాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసినదిగా వినతిపత్రం సమర్పించారు. అనంతరం వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వంగా గీతా విశ్వనాథ్, డాక్టర్ గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్పరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించి కేంద్రమంత్రితో సమావేశ వివరాలు వెల్లడించారు.

ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ… దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లాకు సంబంధించి చింతపల్లి, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి, రాజయ్యపేట ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లకు రూ. 75కోట్లతో పీఎంఎస్‌వై కింద కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో తరచూ నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చాలాసార్లు చేపల వేటకు సంబంధించి గొడవలు జరగడం, పరస్పరం కేసులు పెట్టుకోవడంతో పాటు తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పులికాట్‌ సరస్సులో మేట వేసిన ఇసుకను డ్రెజ్జింగ్‌ చేయడానికి 45 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్టు వెల్లడించారు. రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

రాష్ట్రానికి ఆదాయం తెస్తున్న, ఆక్వా కల్చర్‌ ఉత్పత్తి ఎ‍క్కువగా ఉన్న ప్రాంతంలో సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్వా కల్చర్‌ ఆథారిటీకి సంబంధించిన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని, ఇందుకు కృష్ణా జిల్లా లేదా తూర్పు గోదావరి జిల్లాలో భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎంపీల బృందం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. సిబా కార్యాలయాన్ని వెంటనే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాష్ట్రానికి సంబంధించి 2 లక్షల 16వేల హెక్టార్లు ఆక్వా, ఫిష్‌ కల్చర్‌ సాగు జరుగుతోందని, వీటిపై సుమారు 3లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయని ఆయనకు వివరించారు. దేశంలోనే ఆక్వా కల్చర్‌కు సంబంధించి విదేశీ మారకద్రవ్యం 43వేల కోట్ల రూపాయిలు ఆర్జిస్తే.. అందులో రూ. 15,600 కోట్లు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే భాగస్వామ్యం కావడం గర్వించదగ్గ విషయమని మోపిదేవి చెప్పుకొచ్చారు.

ఆర్బీకేల ద్వారా ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు, ఆక్వా రైతులకు అవసరమైన సీడ్‌, ఫీడ్‌ అందిచడమే కాకుండా, ఆక్వా ఉత్పత్తులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి, ఆక్వా రైతాంగానికి ఇన్యూరెన్స్‌ పాలసీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఎంపీ వెల్లడించారు.

ఆక్వా రంగాభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వివరించారు. ఆక్వా రంగానికి సంబంధించి పవర్‌ టారిఫ్‌కు కూడా తోడ్పాటు, ఆక్వా క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు విశాఖ జిల్లా బండారుపల్లిలో రూ.40కోట్లతో ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చినా కోవిడ్‌ కారణంగా కాలయాపన జరిగిందని, వాటన్నింటిని రివైజ్డ్ ఎస్టిమేషన్‌ వేసి మళ్లీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌తో మంజూరు చేయాలని కోరగా మంత్రి పర్షోత్తం రూపాలా సానుకూలంగా స్పందించారని మోపిదేవి వెంకటరమణ తెలిపారు..

- Advertisement -

విశాఖ పరిసర ప్రాంతాల్లో తరచూ నేవల్‌ ఈవెంట్‌ సమయంలో వేటను నిషేధించడంతో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఎంపీల బృందం కోరింది. బతుకుదెరువు కోసం గుజరాత్‌ పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లి పాకిస్తాన్‌కు బందీలుగా చిక్కుకున్న మత్స్యకారులను కాపాడటానికి, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరామన్నారు. సాధ్యమైనంత త్వరలో కేంద్రమంత్రితో పాటు మత్స్యశాఖ అధికారులు రాష్ట్రంలో పర్యటించి ముఖ్యమంత్రితో సమావేశమవుతారని మోపిదేవి తెలిపారు.

అనంతరం ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి మాట్లాడుతూ… పులికాట్‌ సరస్సు మొత్తం విస్తీర్ణంలో 440 చ. కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లోనూ, 200 చ. కిలోమీటర్లు తమిళనాడులోనూ ఉందని, చేపల వేట సమయంలో రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన రూ.48 కోట్ల నిధులను మంజూరు చేయాలల్సిందిగా కేంద్రమంత్రిని కోరామన్నారు. దీనిపై సానుకూలంగా వ్యవహరించిన పర్షోత్తం రూపాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలోని మత్స్యకార సమస్యలను పరిష్కరించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. విజయనగరం జిల్లా ఎచ్చెర్లలోని బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీల ఏర్పాటుకు కేంద్రమంత్రిగారిని అడగటం జరిగింది. విజయనగరం, ఎచ్చెర్ల నియోజకవర్గంలో జెట్టీలు లేకపోవడం వల్ల మత్స్యకారులు వలసలు వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌కు కేంద్రం నుంచి నిధులు రావాల్సిన నిధులను విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు.

అత్యధిక మత్స్యకార జనాభా ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీరప్రాంతం కూడా చాలా ఎక్కువగా ఉందని వంగా గీత అన్నారు. సీఎం జగన్ డీజిల్‌ సబ్సిడీతోపాటు మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే తక్షణమే మృతుల కుటుంబాలకు పరిహారం, వారికి గృహాల మంజూరు, స్థలాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఉప్పాడ ప్రాంతంలో ఫిషింగ్‌ హార్బర్‌ సెంటర్‌, తొండంగి ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఫిష్‌ ల్యాండింగ్‌ గురించి కేంద్రమంత్రిని అడిగామని తెలిపారు. మరోవైపు తీర ప్రాంతం అంతా కోతకు గురై మత్య్సకారుల గ్రామాలు కొట్టుకుపోతున్నాయని, ప్రధాన రోడ్లు కూడా సముద్రంలో కలిసిపోతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి, వారి అభ్యున్నతికి అవసరమైన నిధులు మంజూరు చేస్తారని వంగా గీత ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement