Thursday, May 2, 2024

కాపు ఓబీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధి అంశం.. అందులో మా పాత్రేమీ లేదు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రభుత్వోద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాపు ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సామాజిక న్యాయం, సాధికారత, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలను పలు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయా శాఖల మంత్రులు బుధవారం లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. ఓబీసీ రేజర్వేషన్ల అంశం స్టేట్ లిస్ట్‌కు సంబంధించిన అంశం కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేసింది. కాపు రిజర్వేషన్ బిల్లు 2017ను రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపగా దీనిపై ఆయా శాఖల నుంచి వచ్చిన సమాధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ఓబీసీ జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన కాపు ఓబీసీ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు రెండు మంత్రిత్వ శాఖల కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 50 శాతానికి మించిన మరాఠా ఓబీసీ రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం భారత రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జవాబులపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కాపు సామాజికవర్గాన్ని తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు భారత రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని తప్పుడు ప్రచారం చేశాయని చెప్పుకొచ్చారు. ఈ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని పార్లమెంట్ స్పష్టంగా తెలిపిందని జీవీఎల్ అన్నారు. గతంలో కేంద్రానికి అనవసరంగా పంపిన కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం నుంచి వెంటనే ఉపసంహరించుకుని, కాపులకు బీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలని, కాపులకు సామజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement