Monday, April 29, 2024

Padmavathi Fire .. సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యేకు కోపమొచ్చింది

( ఆంధ్రప్రభ స్మార్ట్, సింగనమల ప్రతినిధి ) – రాయలసీమలో వైసీపీ ఎమ్మెల్యే ఘర్జించారు. అధికార పార్టీలో కులవివక్షను ఎండగట్టారు. ఒక రకంగా తమ పార్టీపై ఎదురు తిరిగారు. ఆమె ఎవరో కాదు, సింగమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ఈ దళిత మహిళ ఎమ్మెల్యే తనకు జరిగిన అన్యాయంపై సింగంలా చెలరేగిపోయారు. ఔను… ఇందులో ఆమె ఆక్రోశం ఉంది. ఆవేదన ఉంది. ఆందోళన ఉంది. ఆత్మాభిమానం ఉంది. అందుకే ధిక్కార స్వరం పెంచారు. అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. టిక్కెట్ ఇవ్వకపోగా.. సీఎం జగన్ దర్శన భాగ్యం కలగలేదని తీవ్ర మనస్థాపంతో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా ప్రకటించిన కొన్ని రోజుల్లోనే .. సింగనమల, మడకశిరలోనూ మార్పు తథ్యమని సంకేతాలు తెరమీదకు వస్తున్న తరుణంలో.. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీవ్ర ధిక్కార స్వరం తాజా చర్చకు దారి తీశాయి.

సోమవారం ఉద‌యం తన ఫేస్ బుక్‌ ఖాతా లైవ్‌లోకి సింగనమల ఎమ్మెల్యే వచ్చారు. అధిష్టానం పెద్దలపై దుమ్మెత్తి పోశారు. త‌న నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు? అని పద్మావతి ప్రశ్నించారు. ఒక ఎస్సీ మహిళను కాబట్టే అంత చిన్న చూపా…? అని నిలదీశారు. ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ.? సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాలి. మా కాలువల నుంచి కుప్సాని నీళ్లు తీసుకెళ్తుంటే చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నియోజకవర్గ ప్రజలు అయిదేళ్లు అవకాశం ఇస్తే ప్రజలకు తాగు, సాగునీరు కోసం పోరాటాలు చేయక తప్పలేదని ఎమ్మెల్యే పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.. నీటి కోసం నియోజకవర్గంలోని ప్రజలందరూ తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.. ఎస్సీ మహిళ, మీ కాళ్లు పట్టుకోవాలా..? అందరి కింద అణిగి మణిగి ఉండాలా? ఎవరో ఇగో సంతృప్తికి వాళ్ల కాళ్లు పట్టుకోవాలా? అంటూ ధ్వజమెత్తారు.. నీటి వాటా కోసం మాట్లాడకూడదు.. మాట్లాడితే పెద్ద నేరం అది.. ఈ ఐదేళ్ల టర్మ్ లో ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టారంటూ సోషల్‌ మీడియా లైవ్‌లో ఎమ్మెల్యే పద్మావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement