Wednesday, May 1, 2024

ఆ మహిళా అధికారిని పంపించి వేయండి..?

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా తన సొంత ఎజెండాతో ప్రవర్తిస్తున్నారని మండలానికి చెందిన ఒక అధికార ప్రజాప్రతినిధి జిల్లా పరిషత్ చైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ మహిళా అధికారి జనసేన, టీడీపీలకు కొమ్ముకాస్తున్నారని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్ళడంలో విఫలమయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం..! ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రొటోకాల్‌ పాటించకుండా భజన పరులను మాత్రమే స్టేజ్ మీదకు పిలుస్తున్నారని, ఈమె ఉంటే మండలంలో అధికార పార్టీయే కనుమరుగయ్యే ప్రమాదముందని ఆ ఫిర్యాదులో అరోపించినట్లు తెలిసింది. తక్షణమే అయినవిల్లి మండలంలో ఆ మహిళా అధికారికి డిప్యుటేషన్ రద్దుచేసి వేరొక చోటికి పంపాలని ఫిర్యాదులో కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ అందేలా చేయడంలో ఆ మహిళా అధికారి చేసిన కృషికి ఉన్నతాధికారుల మన్ననలు పొందిన సంద‌ర్బాలు అనేకంగా ఉన్నాయని అధికార పార్టీ వర్గాల నాయకులే అంటున్నారు. అలాంటిది మండలంలో కొంతమంది నాయకుల మాట ఆమె వద్ద చెల్లుబాటు కాకపోవడంతో అధికార పార్టీ పేరుచెప్పి ఇలాంటి ఫిర్యాదులు చేయడం మంచి పరిణామం కాదని వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement