Sunday, May 19, 2024

ఏది ఐశ్వర్యం

”ఐశ్వర్యాభివృద్ధి రస్తు” అని దీవిస్తారు పెద్దలు. సిరి సంపదలు, యశస్సు, గౌరవం, రాజ్యం, ఆయువు, ఆరోగ్యం, ధైర్యం, స్థైర్యం, విద్య, వినయం, ఇల్లాలు, పిల్లలు వగైరా ఐశ్వర్యాలు ఉండాలని అనుకుంటారు. పొందా లని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ ఐశ్వర్యాలను పొంద గలగటం వేల జన్మల సుకృతంగా భావిస్తారు. నిజానికి ఏది నిజమైన ఐశ్వర్యం? వేల వేల కోట్లు బ్యాంకు ఎకౌంటులలో మూలగడమా? వందల తరాలు జల్సాగా బ్రతకగలిగే ఆస్తిపాస్తులకు యజ మాని కావడమా? ఖరీదైన కార్లు, ఆకాశాన్ని అంటే భవంతు లు మన స్వంతం అవటమా? నౌకర్లు సేవకులు ఉండటమా? ఉన్నత స్థాయి ఉద్యోగంతో అధికారం, హోదా, డాబూ, దర్పం ప్రదర్శించటమా? అమెరికా ఆస్ట్రేలియా, ఇంగ్లాండు వగైరా దేశాలలో కొడుకులు కూతుళ్ళు స్థిరపడి, ఫారిన్‌ సెటిల్డ్‌ అనిపించుకోవటమా? ఏది ఏది నిజమైన ఐశ్వర్యం?
లోతుగా ఆలోచిస్తే, ఐశ్వర్యం అంటే ఏమిటో అర్థం అవు తుంది. సజ్జన సాంగత్యం, మంచి గురువు లభించటం, సత్‌ గ్రంధ పఠనం, సౌశీల్యమైన హృదయంతో ఉండగలటం, సదాలోచనలతో బ్రతికగలగటం ఐశ్వర్యం. రాళ్ళు తిని అర గించుకో గలగటం ఐశ్వర్యం. నిండైన ఆరోగ్యంతో మంచి ఆలోచనలతో మంచిదనానికి మారు పేరుగా ఉండటం ఐశ్వర్యం. ఏ రకమైన అప్పులు ఋణాలు లేకుండా నిశ్చిం తగా ఉండగలగటమూ ఐశ్వర్యమే. మన అవసరాలకు తగినంత ధనం సమకూరడమూ ఐశ్వర్యమే. తల్లి తండ్రులను ప్రతిరోజూ ప్రతి క్షణం చూసు కోగలగటం అసలు సిసలు ఐశ్వర్యం. ఆత్మీయత, అనురాగా లతో ఆనందంగా భార్యాభర్తలు యిద్దరూ జీవించటం ఐశ్వ ర్యం. జీవించ గలగటం నిజమైన ఐశ్వర్యం. తల్లి తండ్రుల మాటలను తూచా తప్పకుండా పాటించడం, వారిని కంటి రెప్పలా కాపాడుకోవటం, వారి ఆశీస్సులు పొందగలగటం ఐశ్వర్యం. మన మాట వినే సంతానం కలిగి ఉండటం ఐశ్వర్యం. సంతానం సమాజంలో మంచిగా గుర్తింపు సంపాదిం చుకోవటమూ ఐశ్వర్యమే. శాంతితో ప్రశాంతతతో హాయిగా ఉండగలగటమూ ఐశ్వర్యమే. కడుపు నిండా తినగలగటం, కంటినిండా నిద్ర పోగలగటం ఐశ్వర్యమే. రాత్రి పడుకున్నాక ఆరోగ్యంగా లేవగలగటమూ ఐశ్వర్యమే. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ”నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుకుని, నేనున్నానని నిండుగ పలికే తోడుండటం ఐశ్వర్యం. స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా, స్వార్ధ రహితంగా మనల్ని ప్రేమించే మిత్రులు ఉండటం ఐశ్వర్యం. పదిమంది చేత గౌరవింపబడటం, పదిమందిలో గౌరవంగా బ్రతకగలగటం ఐశ్వర్యం. ఇతరులకు సహాయ సహకారాలు అందజేసే గుణం కలిగి ఉండటమూ ఐశ్వర్యమే. ”ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటను లేనేలేదు.” అని అంటారు ఆరుద్ర. కాబట్టి ఇవ్వడమూ ఐశ్వర్యమే. ఇవ్వగలగటమూ ఐశ్వర్యమే. సమాజ హితం కోరుకోవటం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే నైజం కలిగి ఉండటం, ఐశ్వర్యాలన్నిటిలోను పెద్ద ఐశ్వర్యం. మనిషిమనీషిగా మారగలగటం ఐశ్వర్యం. మర ణం తర్వాత కూడా బ్రతకగలగటం మహా ఐశ్వర్యం. ఇలాంటి మహా ఐశ్వర్యాలు అన్నీ కలిగి ఉండటం ఐశ్వర్యాలకే ఐశ్వర్యం. మహోత్కృష్ట ఐశ్వర్యం.

– ఎ.ఆర్‌.ప్రసాద్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement