Friday, April 26, 2024

Big story: ఎఫ్‌ఎంజీలపై ఆంక్షల కత్తి… చలో ఢిల్లికి సిద్ధం అవుతున్న విద్యార్థులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఎఫ్‌ఎంజీ (ఫారన్‌ మెడికల్‌ గ్యాడ్యుయేట్స్‌) లు పోరుబాటకు సిద్ధం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన ఆంక్షల్ని తొలగించాలంటూ ఈనెల 28న ఛలో ఢిల్లి కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) వద్ద ఆందోళన చేపట్టనున్నారు. ఎఫ్‌ఎంజీలు ఇంటర్న్‌షిప్‌ (హౌస్‌సర్జన్‌) రెండేళ్ళు చేయాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతామన్నది ఎఫ్‌ఎంజీల వాదన. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఎఫ్‌ఎంజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రెండేళ్ళ ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని నిరసిస్తూ పలువురు ఎఫ్‌ఎంజీలు చైనా, ఫిలిప్పైన్స్‌, ఉక్కెయిన్‌, సెంట్రల్‌ అమెరికా, జార్జియా తదితర దేశాల బాట పడుతున్నారు. నాలుగున్నర ఏళ్ళ వైద్యవిద్యను పూర్తి చేసుకున్న ఎఫ్‌ఎంజీలు గతంలో ఏడాది పాటు మాత్రమే ఇంటర్న్‌షిప్‌ చేసే వారు. కేంద్రప్రభుత్వం కొత్తగా గతేడాది సెప్టెంబర్‌లో ఎఫ్‌ఎంజీలు రెండేళ్లు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో జారీ చేసింది.

ఇండియన్‌ మెడికల్‌ గ్యాడ్యుయేట్స్‌ (ఐఎంజీ)లకు మాత్రం ఇంటర్న్‌షిప్‌ ఏడాది చేస్తే చాలునంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వివాదానికి కారణమైంది. ఎఫ్‌ఎంజీలు ఇండియాలో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి సంబంధించి ఈ ఏడాది జూన్‌ 4న నిర్వహించిన ఎఫ్‌ఎంజీ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఎఫ్‌ఎంజీలు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 22 వేల మంది విద్యార్థులు ఈపరీక్షకు హాజరైతే కేవలం 2,346 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పదిశాతం మాత్రమే పాస్‌ పర్సంటేజ్‌ నమోదైంది. గతంలో ఎప్పుడూ కూడా ఇంత దారుణమైన రీతిలో పాస్‌ పర్సంటేజ్‌ నమోదు కాలేదు. 2021లో నిర్వహించిన ఎఫ్‌ఎంజీలో 23 శాతం పాస్‌పర్సంటేజ్‌ వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగానే వచ్చిన మార్కుల్లో మైనస్‌ 30 చేశారని పలువురు ఎఫ్‌ఎంజీలు ఆరోపిస్తున్నారు.

అంతా లిమిటెడ్‌

- Advertisement -

ఇంటర్న్‌షిప్‌ చేయడానికి కూడా లిమిటెడ్‌ హాస్పటల్స్‌, లిమిటెడ్‌ సీట్స్‌, విత్‌ అవుట్‌ స్టైఫండ్‌ వంటి ఇబ్బందుల్ని సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఎంపిక చేసిన హాస్పటల్స్‌లో మాత్రమే ఎఫ్‌ఎంజీలు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. న్యూఢిల్లిలోని ఆరు కళాశాలల్లో కేవలం 75 సీట్లు మాత్రమే ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు ఎఫ్‌ఎంజీలకు కేటాయించారు. ఈలెక్కన దేశ వ్యాప్తంగా 3 వేల సీట్లు దాటే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌ఎంజీ పరీక్షకు హాజరైన వారి సంఖ్య 22 వేలు ఉంటే కేవలం మూడు వేల సీట్లు కేటాయించడం అంటే పొమ్మనకుండా పొగపెట్టడమేనని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలాంటి విధానాలు ఉండేవి కాదని ఏ దేశంలో వైద్య విద్యను అభ్యసించినప్పటికీ భారత దేశంలో హౌస్‌సర్జన్‌ చేసేందుకు విస్తృతంగా అవకాశాలు ఉండేవని, ప్రభుత్వ కళాశాలల్లో అయితే రూ.50 వేలు, ప్రైవేటు కళాశాలల్లో అయితే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మేర ఫీజులు ఉండేవని ఎఫ్‌ఎంజీలు చెబుతున్నారు.

విద్యార్థులపై ఆర్థిక భారం

కేంద్రం ఆంక్షల నేపథ్యంలో ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం 80 శాతం మంది విదేశాల బాట పడుతున్నారు. అక్కడ ఫీజులు, రవాణా, వసతి ఖర్చులు వెరసి ఒక్కో విద్యార్థికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మేర భారం పడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము విదేశాలకు వెళ్ళాల్సి వస్తోందని గుంటూరుకు చెందని ఎఫ్‌ఎంజీ గణేష్‌ ‘ఆంధ్రప్రభ’కు తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలు కుటుంబాలకు దూరంగా ఉండి దేశం కాని దేశంలో అవస్థలు పడి వైద్య విద్యను పూర్తి చేసుకొని వస్తే ఇంటర్న్‌షిప్‌లో కేంద్రం అడ్డగోలు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఫారన్‌ వెళ్లకముందే ఈ నిబంధన ఉంటుదని చెబితే తాము వేరే విధంగా నిర్ణయం తీసుకొనే వాళ్ళమని, హఠాత్తుగా కేంద్రం ఉత్తర్వులుజారీ చేయడం వల్ల తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో విద్యార్థి రాధికా రెడ్డి మాట్లాడుతూ పరాయి దేశంలో చదువు కోసం అనేక ఇబ్బందులు పడి వైద్యవృత్తి ద్వారా దేశానికి సేవ చేస్తామంటే ఇన్ని ఆంక్షలు విధించడం తగదన్నారు.

ఐఎంజీలకు లేని నిబంధన ఎఫ్‌ఎంజీలకు ఎందుకని ప్రశ్నించారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని కృష్ణాజిల్లాకు చెందిన శ్రీనివాస్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో స్వదేశానికి వచ్చిన సందర్భంలో ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి ఇండియాలో వైద్య విద్యను పూర్తి చేసుకోవచ్చని చెప్పిన కేంద్రం ఆ అవకాశం కల్పించలేదన్నారు. తొమ్మిది దేశాలను ఎంపిక చేసి ఆయా దేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వాళ్ళపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబర్చడం అన్యాయమన్నారు.

ఆంక్షల కత్తి

రాష్ట్రంలో 11 ప్రభుత్వ కళాశాలల్లో 2,410, 15 ప్రైవేటు కళాశాలల్లో 2,800 వెరసి 5,210 మెడికల్‌ సీట్లు ఉన్నాయి. ఏటా సుమారు 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరవుతున్నారు. ఇందులో 25 శాతం నుంచి 30 శాతం మంది విద్యార్థులు నీట్‌ క్వాలిఫై అవుతున్నారు. అయితే వీళ్ళందరికీ ఇక్కడ ఎంబీబీఎస్‌ సీట్లు దక్కే అవకాశం లేదు. మేనేజ్‌ మంట్‌ కోటాలో ఒక్కో సీటు రూ.12 లక్షల నుంచి మొదలై డిమాండ్‌ను బట్టి ధర కోట్ల రూపాయలు పలుకుతోంది. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలనే ఆశతో ఆస్తుల్ని కుదువపెట్టి లేదా తెగనమ్మి చదివించే తల్లిదండ్రులు కొందరైతే ఆర్థిక స్థోమతకు అనుగుణంగా తమ లక్ష్యాన్ని సాధించుకోవాలనుకొనే వారు మరికొందరు. ఇక్కడ లక్షలు, కోట్లు ఖరీదు చేసే ఎంబీబీఎస్‌ కోర్సు విదేశాల్లో అందుబాటు ధరల్లో ఉండటంతో ఏటా వేలాది మంది వైద్య విద్య కోసం విదేశాల బాట పడుతున్నారు. గతేడాది వరకు ఇంటర్న్‌షిప్‌లో ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ కేంద్రంగా కొత్తగా ఎఫ్‌ఎంజీలపై ఆంక్షల కత్తి దూయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎఫ్‌ఎంజీల పోరుబాట నేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తోందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement