Sunday, October 6, 2024

పర్యాటక ప్యాకేజీల్లోకి ఆర్టీసీ ఎంట్రీ! ఇప్పటికే ప్రయోగాత్మక ప్రాజెక్టులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టీసీ) పర్యాటక రంగంలోకి ఎంటర్‌ అవుతోంది. వారాంతపు రోజుల్లో భిన్నమైన ప్రాంతాలకు వెళ్లాలనే సందర్శకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టీసీ సర్వీసులు నడిపేలా కార్యాచరణ రూపొందిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ అమలు చేస్తోన్న టూరిజం ప్యాకేజీ తరహాలోనే ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొంతకాలంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది.

తమిళనాడులోని అరుణాచలానికి రాష్ట్రంలోని పలు డిపోల నుంచి బస్సులను నడిపిస్తోంది. ఇదే సందర్భంలో వేలాంకిణికీ స్పెషల్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక పర్వదినాల్లో పుణ్యక్షేత్రాలకు స్పెషల్‌ సర్వీసులను నడుపుతుండటంతో ప్రయాణికులు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ముఖ్యంగా అరుణాచలం బస్సులకు ప్రత్యేక ఆదరణ వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. ప్రతి నెలా పౌర్ణమి రోజుల్లో నడిపే సర్వీసులకు విశేష స్పందన రావడంతో డిపోలు పోటీలు పడీ బస్సులు నడుపుతున్నాయి.

ఇదే క్రమంలో ఇటీవల పర్యాటక ప్రాంతాలపై కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే కొన్ని పర్యాటక ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసులకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. పర్యాటకుల నుంచి ఆదరణ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల నిర్వహణపై అధికారులు దృష్టిసారించారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించడంపై కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -

ప్రయోగం సక్సెస్‌..

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సముద్ర తీరాలు, నదీ పరివాహక ప్రాంతాలు, చారిత్రక నేపధ్యం ఉన్న కోటలు, బౌద్ధ ఆరామాలు..ఇలా ప్రతి జిల్లాలోను పర్యాటక ప్రాంతాలు అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి అమలు చేస్తోంది. ఇదే తరహాలో ఆర్టీసీ కూడా ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలపై ప్రయాణికులను సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళ్లనుంది. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతానికి మధ్యలోని ఇతర దర్శనీయ ప్రాంతాలను కలిపేలా ప్యాకేజీలు రూపొందిస్తున్నారు.

విజయవాడ నుంచి అరకు, పాడేరు ప్రాంతాలకు ఇటీవల ప్రత్యేక ప్యాకేజీపై టూర్‌ ఏర్పాటు చేశారు. వారాంతపు వేళల్లో నిర్వహిస్తున్న పర్యాటక ప్యాకేజీలు పెద్ద ఎత్తున సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మూడు ట్రిప్పులు నడిపినట్లు అధికారులు చెపుతున్నారు. ఇటీవల మదనపల్లి నుంచి ఊటీకీ పర్యాటక బస్సులను నడుపుతోంది. ఈ నెల 10 నుంచి ఊటీకి స్పెషల్‌ సర్వీసులు ప్రారంభించారు.

మదనపల్లి డిపో అధికారులు శ్రీకారం చుట్టారు. రాత్రి మదనపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు ఊటీ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో మార్గ మద్యంలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ తిరిగి రాత్రి బయలుదేరాల నిర్ణయించారు. మిగిలిన డిపోల నుంచి కూడా సమీప, ప్రత్యేక సందర్శన స్థలాలకు టూర్‌ ప్యాకేజీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పర్యాటక సహకారం..

ఆర్టీసీ పర్యాటక ప్యాకేజీలకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపధ్యంలో సందర్శకుల విశ్రాంతి, ఆహార పదార్థాలు తీసుకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టిసారించారు. ఆర్టీసీ ప్రవేశ పెట్టిన పర్యాటక టూర్లు రూ.2000 నుంచి రూ.2500 మధ్య ఉంటున్నాయి. అతి తక్కువ ఖర్చుతో అరకు, పాడేరు, ఊటీ వంటి ప్రత్యేక ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతోంది. పర్యాటకులకు ఇతర ఖర్చులను కూడా తగ్గించే క్రమంలో పర్యాటక శాఖ అధికారుల సహకారం తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఏపీటీడీసీ ప్రవేశ పెట్టే ప్యాకేజీలతో నిమిత్తం లేకుండా తక్కువ ఖర్చుతో బ్యాక్‌ ఎండ్‌(వసతి తదితర) సహకారం అందించాలని అధికారులను కోరుతున్నారు. ఆర్టీసీలో ప్రయాణించే వారు ఎక్కువ ఖర్చు భరించ లేరనే నేపధ్యంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్టీసీ అభ్యర్థన మేరకు పర్యాటక శాఖ డివిజినల్‌ మేనేజర్లతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. పర్యాటక శాఖ సహకారం అందిన వెంటనే ఏపీఎస్‌ ఆర్టీసీ మరిన్ని డిపోల నుంచి ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను ప్రవేశ పెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement