Thursday, October 10, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలో భక్తుల రద్దీ గురువారం కూడా కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 1,2, కంపార్టుమెంట్లు నిండి కిలోమీటర్లమేర భక్తులు క్యూ లైన్‌లలో స్వామివారి దర్శనంకోసం బారులు తీరారు. దీంతో సర్వదర్శనానికి 30 గంటలు సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో విఐపి బ్రేక్‌ దర్శనాలను టీటీడీ ప్రోటోకాల్‌ పరిధిలోని వ్యక్తులకు కేటాయిస్తుంది.

కాగా వేసవి సెలవుల కారణంగా గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్ధం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో తిరుమలలో ఎటుచూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్‌లే కనిపిస్తున్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాలతో పాటు రోడ్డు మార్గం గుండా భారీగా భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూలైన్‌లు వెలుపలకు వ్యాపించాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన షెడ్లు కూడా నిండి ఆళ్వార్‌ ట్యాంక్‌ మార్గం గుండా నారాయణగిరి అతిథిగృహాల మీదుగా శిలాతోరణం రోడ్డు వరకు భక్తులు క్యూలైన్‌లో వేచివున్నారు.

దాదాపు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో స్వామివారిని సర్వదర్శనం గుండా దర్శించుకోవాలంటే దాదాపు 30 గంటలకు పైగా సమయం పడుతూవుంది. భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం బాగా పెరగడంతో క్యూ లైన్‌లోవేచివున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకుల సహాయంతో తాగునీరు, అల్పాహారం లాంటివి ఎప్పటికప్పుడు అందచేస్తున్నారు. ఇక భక్తుల రద్దీ పెరగడంతో గదులు దొరక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. గదులు దొరకని భక్తులు టిటిడి ఏర్పాటు చేసిన లాకర్లను పొంది చెట్ల కింద సేదతీరుతున్నారు. కాగా రద్దీ ఈ వారాంతం కొనసాగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement