Saturday, May 4, 2024

మిర్చి సాగు చేసి న‌ష్ట‌పోయాం.. ఆదుకోండి మ‌హాప్ర‌భో…

మిర్చి పంట సాగుచేశాం.. కుచ్చు తెగులుతో కుదేల‌య్యాం.. ల‌క్ష‌ల రూపాయాల్లో న‌ష్ట‌పోయాం…మ‌మ్మ‌ల్ని ఆదుకోండి మ‌హాప్ర‌భో అంటూ మార్కాపురం మిర్చి రైతులు ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మార్కాపురం మండలంలో మిరప పంటను సాగు చేసిన రైతులకు ఈ ఏడాది గడ్డు కాలం నడుస్తోంది. పంటలో పూత రాదు.. పిందే కాయదన్నట్లుగా మిర్చిసాగు పరిస్థితి నెలకొంది. ఆ పంటనే నమ్ముకున్న రైతుల ఆశలు అడిఆశలవుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా మార్కాపురం ప్రాంతంలో మిరప సాగు చేసిన ప్రతి రైతు నష్టాల్లో కూరుకు పోయారు. మార్కాపురం డివిజన్ లో మిరప పంట సాగుదే అగ్రస్థానం. వ్యవసాయ బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. గత రెండేళ్లు ఓ మాదిరి వర్షాలు కురవడంతో బోరు బావుల్లో కొద్దిపాటి నీటి లభ్యత ఉండేది. ఈఏడాది వర్షాలు కూడా ఇక్కడ చాలా తక్కువ. ఒక్క మార్కాపురం మండలంలో 3,250 ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఇప్పుడు రైతులు సాగుచేస్తున్న మిరప పంట సాగంతా నర్సరీల్లో పెంచిన మొక్కలతో జరుగుతుందని రైతులు తెలిపారు.

ఒక్కో మొక్క రూ.2 చొప్పున కొనుగోలు చేశామన్నారు. ఎకరానికి నారు కోనుగోలుకు రూ.16వేలకు తగ్గకుండా పెట్టుబడి అవుతుందని తెలిపారు. అంతకు ముందు పొలాన్ని సాగుకు సిద్దం చేసుకునేందుకు సేద్యం ఖర్చులు, ఎరువులు, కూలీల ఖర్చుల నిమిత్తం ఎకరానికి రూ.50వేలు ఖర్చవుతుందని అన్నారు. నీలి మందుల పిచికారి కోసం ఎకరానికి రూ.20 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. సగటున ఎకరం మిర్చి సాగుకు పెట్టుబడి రూ.80 వేల నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని తెలిపారు. మొక్కనాటిన నెల రోజుల వరకు పంట బాగానే ఉంది. ఆ తరువాత వైరస్ వ్యాప్తి చెందింది. ఒక్కో మొక్క ఆకులు ముడుచుకుపోవడం జరిగింది. దీన్నే కుచ్చు తెగులు అంటారు ఇక్కడి రైతులు. వాస్తవంగా వైరస్ నివారణకు ఎలాంటి నీలి మందులు పిచికారి చేసినా ఫలితం కానరావడం లేదన్నారు. ఈ తెగులు వ్యాపించిన తరువాత చెట్టు పెరగడం నిలిచిపోతోందని, పూత, పిందె, కాయ ఉండటం లేదని ఒక్కో చెట్టుకు 5 లేదా 10 కాయలు మించి ఉండటం లేదని తెలిపారు. ఇలా అయితే ఎకరానికి రెండు నుండి నాలుగు క్వింటాళ్ల దిగుబడి రాదని, వాతావరణం అనుకూలించి… వర్షాలు సకాలంలో కురిసి… బోర్లలో నీరు పుష్కలంగా లభ్యమైతే ఒక్కో ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చే అవకాశముంద‌న్నారు.

ఒక్కో క్వింటాల్ రూ.10 వేలకు పైగా అమ్మబడితే పెట్టుబడులు పోగా కొద్దిపాటి ఆదాయంలో ఉంటామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితిలో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. వచ్చే కొద్దిపాటి దిగుబడులు కూలీ ఖర్చులకే సరిపోవని రైతులు వాపోతున్నారు. గత రెండేళ్లు వచ్చిన ఆదాయాన్ని ఈ ఏడాది పంటపై పెట్టి నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కో రైతు ఎకరం నుండి 5 ఎకరాల వరకు మిర్చి పంటనే సాగు చేస్తున్నారు. ఎకరానికి దాదాపు రూ. లక్ష చొప్పున నష్టాలకు గురవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వైరస్ తో దెబ్బతిన్న మిర్చిపంట పరిస్థితిని పరిశీలించేలా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఏ రైతు ఎంతమేర నష్టపోయారో గుర్తించాలని, తగిన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటే గానీ రైతు కోలుకునే పరిస్థితి లేదని ఇక్కడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పాటికే కొందరు రైతులు మిర్చి పంటను అర్ధాంతరంగా పంటను రోటావేటర్ (ట్రిల్లర్)తో దున్నేయడమూ జరిగింది.

- Advertisement -


మిర్చి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి – గంగిరెడ్డి చైతన్య, రైతు, బోడపాడు :
మిర్చి రైతు తీరని నష్టాలకు గురయ్యాడని, ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆదుకోని పక్షంలో పెట్టిన పెట్టుబడులు అప్పుల రూపంలో రాబోవు రోజుల్లో రైతుల ఆత్యహత్యలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా ఏ రైతు ఎంతమేర నష్టపోయారో… అధికారుల బృందంతో అంచనాలు తయారు చేయాలని, నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వం అందించాలని బోడుపాడు గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి చైతన్యరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాను మూడు
ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయడం జరిగిందని, ఒక్కో ఎకరానికి రూ. లక్ష మేర పెట్టుబడి పెట్టినా… దిగుబడి లేక పంటను దున్నేందుకు సిద్ధంగా ఉన్నామని వాపోయారు.


సుమారు రూ.4లక్షల వరకు మిర్చి పంటకు పెట్టుబడి పెట్టి నష్టపోయాం – కనకా శ్రీను రైతు :
మిరప పంటను మూడు ఎకరాల్లో దాదాపు నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి సాగుచేశామని కుచ్చు ముడత తెగులు వలన ఈ సంవత్సరం తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. తెగులు సోకిన మిర్చి పంటను అధికారులు పరిశీలించి తమకు నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సంవత్సరం మిర్చి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయాం ప్రభుత్వం ఆదుకోవాలి – పోరెడ్డి.నరశింహరెడ్డి రైతు :
ఈ సంవత్సరం నాలుగు ఎకరాలలో మిరప పంటను సాగుచేశానని కుచ్చు ముడత తెగులు సోకడంతో పైరు గిడసబారి పూత పిందె రాలేదని దీంతో పంటకు పెట్టుబడి పెట్టిన నాలుగు లక్షల రూపాయలు నష్ట పోవలసి వచ్చిందన్నారు. మిరప పంటను దున్ని వేసి మరో పంటను సాగు చేసుకునేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. నష్ట పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement