Monday, April 29, 2024

అక్రమ లేఅవుట్లపై చర్యలేవి..? – పట్టించుకోని మున్సిపల్ అధికారులు

గిద్దలూరు : అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నా అధికారులు మాత్రం మత్తు వదలడం లేదు. దీంతో రీయల్ ఎస్టేట్ వ్యాపారులు మాయమాటలతో అమాయకులైన ప్రజలకు అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. తీరా అది అక్రమ లేఅవుట్లని తెలుసుకొని లబోదిబోమంటున్నారు. అప్పటికే 4వ వంతు నగదు తీసుకొని అగ్రిమెంట్ రాసి ఇస్తున్నారు. ఇలా గిద్దలూరు పట్టణంలోని అక్రమ వ్యాపారం సాగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టడం ఇక్కడ మాములైపోయిందని పలువురు వాపోతున్నారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామని అధికారుల ప్రకటనలు మాటలకే పరిమితం కావడంతో రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ కోసం ఆరునెలలు, ఏడాది సమయం ఇస్తూ కాలయాపన చేసున్నట్లు తెలిసింది. ఇటీవల ఒంగోలు హైవే రోడ్డులో అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. రియల్ వ్యాపారులు బ్రోకర్లకు కమీషన్ ఎరగా చూపుతూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇదేమని అడిగే వారు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. గతంలో 4వ వంతు అడ్వాన్స్ ఇచ్చిన వారు నిలదీయడంతో వారికి మరింత సమయమిచ్చి మచ్చిక చేసుకుంటున్నారు.

అక్రమ లేఅవుట్లపై అవగాహన ఏది :
గిద్దలూరు పట్టణంలో అక్రమ లేఅవుట్లలో రియల్ వ్యాపారం కళ్ళ ఎదుట జరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ లేఅవుట్లపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏది అక్రమమో, ఏది సక్రమమో తెలియని ప్రజలు బ్రోకర్ల మాయలోపడి విలవిల‌లాడుతున్నారు. ముందుగానే అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవడం, ప్రజలకు అవగాహన కల్పించడం చేస్తూ తాము నష్టపోయేవారం కాదని, ఇదంతా అధికారులు, వ్యాపారుల మధ్య కుమ్మక్కుతోనే జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

మున్సిపల్ ఆదాయానికి గండి :
అక్రమ లేఅవుట్ల కారణంగా గిద్దలూరు నగర పంచాయితీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. నిబంధనలు పాటించకపోవడం, భూములను వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయించుకోకపోవడంతో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం పక్కదారి ప‌డుతుందనే విమర్శలున్నాయి.

నిబంధనలు గాలికి :
లేఅవుట్లలో ప్లాట్లు వేసి విక్రయించాలంటే ముందుగా మున్సిపాలిటీ నుండి అనుమతులు పొందాలి. నిబంధనలు పాటించాలి. లేఅవుట్లలో ప్లాట్లలో 40అడుగుల రోడ్లు వేయాలి. బడికి, గుడికి, సామాజిక అవసరాలకు స్థలాన్ని వదిలి పెట్టాలి. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలేవి పాటించరు. నిబంధనలు తుంగలోతొక్కి ఇష్టారాజ్యంగా అక్రమంగా లేఔట్లు వేస్తూ ప్లాట్లు విక్రయిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండికొడుతూ, కొనుగోలుదారులను మభ్యపెడుతూ అక్రమంగా జేబులు నింపుకుంటున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్లైనా లేదనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. అయినా అధికారులు తమకేంటి అంటూ మౌనం వహిస్తూ ఉండిపోతున్నారే గాని చర్యలు తీసుకోవడం లేదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement