Friday, May 3, 2024

క్రికెట్ బెట్టింగుపై ఉక్కుపాదం.. ముఠా గుట్టురట్టు

క్రికెట్ బెట్టింగుపై అనంతపురం 1 టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా కొనసాగుతోన్న క్రికెట్ బెట్టింగు వ్యవహారం గుట్టు రట్టు చేశారు. కీలక బుకీ సహా మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 6 లక్షల నగదు, 2 కమ్యునికేటర్లు, 24 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్ టాప్ లు, 2 ట్యాబ్ లు, రూటర్ , జంక్షన్ బాక్సు, 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు శుక్రవారం సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహన్ రావు, అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అరెస్టయిన నిందితుల వివరాలు…

 నిందితులు ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, అజయ్ కుమార్, రామప్ప నాగరాజులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురిలో ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ కీలక బుకీ. గత కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెంగుళూరు కేంద్రంగా ఇతను ఈ అక్రమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాడు. మిగితా ఇద్దరు నిందితులైన ఘట్టమనేని అజయ్ కుమార్, రామప్ప నాగరాజులను క్రికెట్ బెట్టింగ్ లావాదేవీల కోసం తన వద్ద పెట్టుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కమ్యునికేటర్లు, ల్యాప్ టాప్ లు, తదితర అధునాతన సామాగ్రిని వినియోగిస్తున్నాడు. ఐ.పి.ఎల్, తదితర మ్యాచ్ ల సందర్భంగా భారీ ఎత్తున ఆన్లైన్లో బెట్టింగులు నిర్వహిస్తున్నాడు. మ్యాచ్ గెలుపు ఓటములు, ఓవర్ టు ఓవర్, బాల్ టు బాల్… ఇలా అన్నిరకాల బెట్టింగులు సాఫీగా సాగిస్తున్నాడు. బ్యాంకుల ద్వారానే మొత్తాల చెల్లింపు, స్వీకరింపులు కొనసాగిస్తున్నాడు.

ఐపిఎల్ నేపథ్యంలో బెంగుళూరులో పోలీసులు నిఘా ఎక్కువైందని భావించి అనంతపురంలో బెట్టింగ్ వ్యవహారాన్ని గుట్టుగా కొనసాగిస్తున్నాడు. మొత్తం 60 నుండీ 90 అకౌంట్లలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు 20 అకౌంట్లలో అక్రమంగా సాగిన లావా దేవీలు పోలీసులు గుర్తించారు. ఈ అకౌంట్లలో రూ. 2.37 కోట్లను ఫ్రీజ్ చేశారు. మిగితా అకౌంట్లపై కూడా లోతుగా పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement