Monday, April 29, 2024

ఏపీలో 14 ఏళ్ళ పాటు సైకో పాలన: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్‌కి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని అన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ పాలన పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఏపి ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదని హితవుపలికారు. 2019లో 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గౌరవించారని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విషయం అందించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. డబ్బులతో ఎన్నికలకు వెళ్లే సంస్కృతి తెలుగుదేశం పార్టీది అని విమర్శించారు. వైసీపీలో అటువంటి సంస్కృతి లేదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 సంవత్సరాల పాటు సైకో పాలన సాగిందని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత ఏ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్‌ తీసుకున్న జిల్లాల పునర్విభజన ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఉగాది రోజున లాంచనంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని ప్రకటించారు. దీంతో కొత్త జిల్లాల వల్ల ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత దగ్గర  కానుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement