Wednesday, May 15, 2024

అభివృద్ధికి ఆస్కారం..! పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుపై చర్చలు..

విజయనగరం, ప్రభన్యూస్ : పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుపై సర్కార్‌ ప్రకటన గిరిజనుల బతుకు చిత్రాన్ని పూర్తిగా మార్చగలదన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. పార్వతీపురం ఐటీడీఏతో పాటు పాలకొండ నియోజకవర్గ పరిధిలోని సీతంపేట ఐటీడీఏ కూడా మన్యం జిల్లా పరిధిలోకి రావడం గిరిజనాభివృద్ధికి దోహదపడగలదన్నది విశ్లేషకుల అంచనా. మరి పార్వతీపురం జిల్లా కేంద్రం కావడం వల్ల సీతంపేట ఐటీడీఏను మాత్రమే కొనసాగిస్తారా? పార్వతీపురం ఐటీడీఏను కూడా యథాతథంగా వుంచుతారా అన్నది తేలాల్సి వుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని మారినా మారని తలరాతలతో కాలం వెళ్లబుచ్చుతున్న గిరిజనులకు పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటన్నది వరమనే చెప్పాలి కూడా. విజయనగరం జిల్లాలో రెండవ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా వున్న పార్వతీపురం కేంద్రంగానే ఐటీడీఏ కార్యకలాపాలు నడుస్తున్నప్పటికీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమేనన్నది ఎవరైనా అంగీకరించాల్సిందే. ఆయా ప్రభుత్వాలు ఆయా రూపాల్లో కోట్లాది రూపాయిల నిధులు మంజూరు చేసిన సందర్భాలున్నప్పటికీ అవి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అక్కరకొచ్చిన పరిస్థితులు తక్కువేనని చెప్పేందుకు వెనుకాడాల్సిన పని లేదు.

ఈనేపథ్యంలో విజయనగరం జిల్లాలో అంతర్భాగంగా వున్న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా మారనుండడం పెద్ద ఎత్తున అభివృద్ధికి ఆస్కారమిస్తుందని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు. కాగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పడనున్న మన్యం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లిd నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లిd నియోజకవర్గం వచ్చి చేరనుంది. ఫలితంగా మన్యం జిల్లా పరిధిలో మొత్తం 16 మండలాలుంటాయి. పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని 10 మండలాలతో పాటు పాలకొండ డివిజన్‌ పరిధిలోని 6 మండలాలుంటాయి.

విజయనగరం జిల్లాలో కొత్త డివిజన్‌ కేంద్రంగా బొబ్బిలి..

విజయనగరం జిల్లాలో డివిజన్‌ కేంద్రంగా వున్న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా అవతరించడంతో విజయనగరం జిల్లాలో కొత్త డివిజన్‌ కేంద్రంగా బొబ్బిలి అవతరిస్తోంది. బొబ్బిలి డివిజన్‌ పరిధిలోకి బొబ్బిలి, గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదాం, రామభద్రపురం, బాడంగి, తెర్లాంతో పాటు శ్రీకాకుళం జిల్ల్లాలోని రాజాం, వంగర, రేగిడి,సంతకవిటి మండలాలుంటాయి.
విజయనగరం డివిజన్‌ పరిధిలో విజయనగరం, గంట్యాడ,ఎస్‌.కోట, కొత్తవలస,జామి, వేపాడ, ఎల్‌.కోట, భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ,నెల్లిమర్ల, గుర్ల,గరివిడి, చీపురుపల్లి, బొండపల్లి మండలాలుంటాయి. వాస్తవానికి చీపురుపల్లి డివిజన్‌ కేంద్రం కావాలన్న డిమాండ్‌ వున్నప్పటికీ ఆ అవకాశాలు లేనట్లు పరిస్థితులు చాటిచెబుతున్నాయి.

ఇంతవరకు విజయనగరం జిల్లా తొమ్మిది అసెంబ్లి స్థానాలు, మూడు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో వున్న వైనం తెలిసిందే. ఎస్‌.కోట అసెంబ్లి నియోజకవర్గం విశాఖ పార్లమెంటు పరిధిలో ఇంత వరకు వుండగా ఇపుడు విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోకి చేరుతుంది. అంటే విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలికి ఎస్‌.కోట జత కలుస్తుంది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గం చేరుతుంది. ఇంతవరకు విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో వున్న ఎచ్చెర్ల మాత్రం శ్రీకాకుళం జిల్లాలోకే పోతుంది.

- Advertisement -

మొత్తం మీద విశాఖ జిల్లాలోని గజపతినగరం, ఎస్‌.కోట,భోగాపురం తాలూకాలు, శ్రీకాకుళం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు,కురుపాం,చీపురపల్లి తాలూకాలు కలిపి 1979 జూన్‌ 1న ఏర్పడిన విజయనగరం జిల్లా ఇపుడు తన పరిధిలోని కొన్ని అసెంబ్లి నియోజకవర్గాలను త్యజిస్తూ పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా పుట్టుకకు దోదహపడినట్లయింది. రెండు రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలతో వున్న విజయనగరం జిల్లా ఇపుడు కూడా రెండు రెవెన్యూ డివిజన్లుగా వున్నా 26 మండలాలకు పరిమితం కానుంది. విజయనగరం డివిజన్‌ పరిధిలో 15 మండలాలు, బొబ్బిలి డివిజన్‌ పరిధిలో 11 మండలాలు వుంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement