Tuesday, May 14, 2024

మ‌హాశివరాత్రి వేళ కోట‌య్య కు కాసుల క‌ష్టాలు…

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: కోటి వేల్పుల అండ కోటప్పకొండ… కోటి ప్రభలతో కొండకు తరలి వస్తే కొండ దిగివస్తానని శివయ్యే స్వయంగా చెప్పినట్లు చరిత్ర చెబుతోంది. దేశంలో అరుదైన మేధా దక్షిణామూర్తిగా పూజలందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండలో వేంచేసియున్న త్రికోటేశ్వరునికి తిరునాళ్ళ కష్టాలు తప్పడంలేదు. ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరిం చుకుని కోటప్పకొండలో అంగరంగ వైభవంగా ప్రభల తిరునాళ్ళ నిర్వహిస్తారు. ఆంధ్రా, తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో కోటప్పకొండ తిరునాళ్ళకు తరలివచ్చి కోటయ్యను దర్శించుకుని తరించిపోతుం టారు. కోటప్పకొండ తిరునాళ్లను 2009లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అప్పటి నుంచి తిరునాళ్ల నిర్వహణకు ఏటా రూ.25 లక్షలు నిధులు విడుదల చేసేంది. 2015లో రాష్ట్ర ప్రభుత్వ పండగ కింద ఇచ్చే నిధులను రూ.30 లక్షలకు పెంచి మంజూరుచేశారు. అయితే ఈ మొత్తం 2017 వరకు విడుదల కాగా 2018లో మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటిని దేవస్థానం అధికారులు నిర్ణీత గడువులోగా ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. అప్పటి నుంచి ఏటా ఆలయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటమే గానీ ఇప్పటివరకూ నిధుల మంజూరు కాలేదు. ఇటీ-వల దేవాదాయశాఖ మంత్రి కొట్టు -సత్యనారాయణను ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవస్థానం అధికారులు కలిసి మహాశివరాత్రికి కోటప్పకొండను సందర్శించాలని ఆహ్వానించారు. నిధుల గురించి కూడా విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని చెప్పారే తప్పించి ఇంతవరకు నిధులు విడుదల కాలేదు.

స్థానిక సంస్థల నుంచి నిధుల సమీకరణ
కోటప్పకొండ తిరునాళ్ల కోసం పల్నాడు జిల్లాలోని పంచాయతీలు, మండల పరిషత్‌ల నుంచి నిధులు సమకూర్చుకోవడానికి జిల్లా యంత్రాంగం ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీ నుంచి రూ.10 వేలు, మేజర్‌ పంచాయతీ నుంచి రూ.20 వేలు, మండల పరిషత్‌ నుంచి రూ.50 వేలు సాధారణ నిధుల నుంచి నరసరావుపేట మండలంలోని కొండకావూరు పంచాయతీకి జమ చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఈ సొమ్మును ఈ నెల 17నుంచి 19 వరకు మహాశివరాత్రి ఉత్సవాల్లో ఏర్పాట్లు-, భక్తులకు సౌకర్యాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు వెచ్చించనున్నారు. రాష్ట్ర హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్లకు కూడా పంచాయతీలు, మండల పరిషత్ల నుంచి ఏటా నిధులను సమకూర్చుకోవడం గమనార్హం. త్రికోటేశ్వరునికి ఏటా రూ.కోట్లలో ఆదాయం ఉన్నా దేవాదాయశాఖ సైతం పండగ నిర్వహణకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చడం లేదు. అటు- ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో జిల్లాలోని పంచాయతీలపై భారం వేస్తున్నారు.

కనీస వసతుల కల్పనకు కష్టాలు
కోటప్పకొండ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. వీరందరికీ కనీస వసతులు కల్పించడానికి ఆయా శాఖలకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. అవి కొంత వరకు నిధులు సమకూర్చుకున్నా సరిపోవడం లేదు. దీంతో నిధుల కోసం ఏటా తిప్పలు తప్పడం లేదు. దేవాదాయశాఖ పండగ నిర్వహణకు రూ.50 లక్షల వరకూ వెచ్చిస్తోంది. విద్యుత్తు అలంకరణలు, పూలమాలలు, చలువపందిళ్లకు సుమారు రూ.15 లక్షలు సొమ్ము అవసరమవుతుంది. భక్తులకు తాగునీరు. మజ్జిగ పంపిణీ, పిల్లలకు పాలు తదితరాలు అందజేస్తారు. వీఐపీలు, ప్రోటోకాల్‌, ప్రత్యేకంగా క్యూలైన్ల ఏర్పాట్లు-, భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమాలకు కొంత సొమ్ము వెచ్చిస్తారు. పంచాయతీశాఖ ఆధ్వర్యంలో 450 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తున్నారు. వీరిలో పంచాయతీలకు సంబంధించిన సిబ్బంది 150 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారిని మూడు రోజులకు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటారు. వీరికి మూడు రోజులకు వేతనాలు, భోజనాలు ఏర్పాటు- చేయాలి. కొండపైన, కింది భాగంలో చెత్త సేకరణకు 1000 వరకూ డస్ట్‌ బిన్లు వినియోగిస్తారు. చీపుర్లు, బ్లీచింగ్‌ తదితర సామగ్రి కొనుగోలు చేయాలి. వీటన్నిటికి రూ.20 లక్షల పైగా వెచ్చించాల్సి వస్తోంది. విద్యుత్తు సౌకర్యం, ఏర్పాట్లకు ఏటా రూ.25 లక్షల వరకూ వ్యయం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement