Tuesday, May 14, 2024

వ్యవస్థలెన్ని వున్నా..అవస్థలు అలాగే..!

విజయనగరం, ప్రభన్యూస్‌ : వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న ‘అందరికీ ఇళ్లు’ పథకం జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కదలిక వుందని చెప్పవచ్చు తప్ప ఆహా! ఓహో! అనేందుకు ఏమీ లేదన్నది నిర్వివాదాంశం. ఎక్కడైనా పది, ఇరవై ప్లాట్లు వున్న లేఅవుట్లు మినహాయిస్తే గుంకలాం వంటి అది పెద్ద హౌసింగ్‌ కాలనీలో నిర్మాణాల ప్రగతి మచ్చుకైనా కానరాని దుస్థితి. జిల్లాలో అర్బన్‌,రూరల్‌ పరిధిలో చిన్నా, పెద్ద కలుపుకొని మొత్తం 907 హౌసింగ్‌ లేఅవుట్లుండగా ఇప్పటికీ 131 లేఅవుట్లలో లబ్ధిదారులు నిర్మాణాల జోలికి పోలేదు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులకు సంబంధించిన గుంకలాం మెగా లేఅవుట్లో ఆన్‌లైన్‌ లెక్కల ప్రకారం మొత్తం 11,571 మంది లబ్ధి చేకూరగా ఇంత వరకు 2,931 మంది తమ ప్లాట్లను చూశారో? లేదో? తెలియని పరిస్థితి. అలాగని తక్కిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగిపోతున్నాయా? అంటే అదీ లేకపోయింది. ఏకంగా 8589 మందికి సంబంధించి బిలో బేస్‌మెంట్‌ లెవెల్లో(బీబీఎల్‌) వున్నట్లు అధికారులు చెబుతున్నారు. బీబీఎల్‌ అంటే నిర్మాణం ప్రారంభం కానివి కూడా కలుపుకోవాల్సివుందని పరిస్థితులు చెబుతున్నాయి. జిల్లా కేంద్రానికి సంబంధించిన ఇళ్ల నిర్మాణాల సం’గతే’ ఇలా వున్నప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు ఎలా వుంటాయో? ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. గుంకలాం లేఅవుట్‌కు సంబంధించి కాంట్రాక్టర్‌ సౌలభ్యం కోసం చూస్తున్నారు తప్ప మన అధికారులు ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి పట్టించుకోని పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి.

బోర్లు వేసినా అక్కరకు రాని పరిస్థితి. సామగ్రి దొంగతనం జరుగుతుందన్న కారణంగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల జోలికి పోలేదని తొలినాళ్లలో చెప్పుకొచ్చిన అధికారులు ఇప్పటికీ అదే కారణం చూపి అలక్ష్యంగా వున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి సిల్లి కారణాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోరాదని ప్రభుత్వం పగడ్బందీగా గుత్తేదారులకు నిబంధనలు విధించినా ఆమేరకు రక్షణ, సంపుల్లో నీటిని నింపే సిబ్బంది నియామకాలు జరిపిన దాఖలాలు లేకపోయాయి. హెచ్చరికలు జారీ చేసి సదరు పనులు చేయించాల్సిన హౌసింగ్‌ జేసీ కూడా ఆమేరకు చొరవ చూపడం లేదని పరిస్థితులు చాటిచెబుతున్నాయి. మొత్తం మీద అందరికీ ఇళ్లు పథకం జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించడం లేదని చెప్పవచ్చు. ఆన్‌లైన్‌ లెక్కల ప్రకారం చూసుకున్నా అందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి జిల్లాలో మొత్తం 79,619 మంది హౌసింగ్‌ లబ్ధిదారులుండగా 17,318 మంది ఇళ్ల నిర్మాణాల జోలికి పోలేదు. 39,728 మంది బిలో బేస్‌మెంట్‌ లెవెల్‌ (అధికారిక నివేదికల ప్రకారం)నిర్మాణాలకే పరిమితమయ్యారు. మరో 13,095 మంది పునాదులను నిర్మించి చేతులెత్తేశారు. మొత్తంగా 4478 మంది రూఫ్‌ లెవెల్‌ నిర్మాణాల వద్ద నిర్మాణాలు ఆపేశారని తెలుస్తోంది. 5,194 మంది శ్లాబ్‌లు వేసి ముందుకు సాగలేక కూర్చున్న పరిస్థితి. జిల్లా మొత్తంగా పూర్తయిన ఇళ్ల సంఖ్య కేవలం 116. ఇదీ…జిల్లాలో అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాల ప్ర’గతి’.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement