Friday, May 3, 2024

Nijam Gelavaali – వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీదే గెలుపు – నారా భువనేశ్వరి

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – వచ్చే ఎన్నికల కురక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆమె శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన నాలుగు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ టీడీపీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారన్నారు.సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక పలువురు కార్యకర్తలు మృతిచెందడం బాధాకరమన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆదుకోవాలని జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తనతో చెప్పారని భువనేశ్వరి అన్నారు. బిడ్డల్లాంటి కార్యకర్తలను ఆదుకోవడం తన కర్తవ్యమన్నారు. ఇందులో భాగంగానే చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటున్నానని వివరించారు. ఇప్పటిదాకా 90 కుటుంబాలను పరామర్శించానని తెలిపారు. చంద్రబాబు ప్రజల మనిషి అని, ఆయన ధ్యాస అంతా ప్రజలు, కార్యకర్తలేనని అన్నారు. నిరంతరం కార్యకర్తల గురించి పరితపిస్తుంటారని, చంద్రబాబును కార్యకర్తల నుండి ఏ శక్తీ వేరుచేయలేదన్నారు.

తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడి చూపిన అభిమానం ఎప్పుడూ మరువలేనిదన్నారు. తమ కుటుంబం కోసం నిలబడిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని భువనేశ్వరి అన్నారు.అండ లేదని కృంగిపోవద్దు.. మేమున్నాం..మీకు అండ లేదని కృంగిపోవద్దు…మీకు మేమున్నాం అంటూ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

విజయవాడ పార్లమెంటు పరిధిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మొదటగా నందిగామ నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. చందర్లపాడు మండలం, కూనాయపాలెం గ్రామంలో పార్టీ కార్యకర్త వనపర్తి మల్లిఖార్జునరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మల్లిఖార్జునరావు(52), గత ఏడాది అక్టోబర్ నెలలో గుండెపోటుతో మృతిచెందారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో పార్టీ కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. గోపయ్య(63) గత ఏడాది అక్టోబర్ 22వ తేదీన గుండెపోటుతో మృతిచెందారు. జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవరం గ్రామంలో పార్టీ కార్యకర్త కుక్కుల ప్రభాకరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ప్రభాకరరావు(60), గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన గుండెపోటుతో మృతిచెందారు. జగ్గయ్యపేట రూరల్ మండలం, బలుసుపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మరణించిన టిడిపి కార్యకర్తల కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి యోగక్షేమాలడిగి తెలుసుకుని వారికి ఒక్కొక్కరికి రూ.3లక్షల చెక్కు అందించారు.

- Advertisement -

వెల్లువెత్తిన అభిమానం,అడుగడుగునా మహిళలు నీరాజనాలు..

విజయవాడ పార్లమెంట్, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి మహిళల నుండి సంఘీభావం వెల్లువెత్తింది. నియోజకవర్గాల ప్రారంభంలో ఘన స్వాగతం పలికిన దగ్గర్నుండి నియోజకవర్గం పూర్తయ్యి వెళ్లే వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భువనేశ్వరికి వెన్నంటి నడిచారు. నందిగామ నియోజకవర్గం కోనాయపాలెం, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు, గౌరవరం, బలుసుపాడు గ్రామాల్లో మహిళలు భువనేశ్వరికి నీరాజనాలు పట్టారు. భువనేశ్వరికి పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. అమ్మా…మీతో మేమున్నామంటూ తమ అభిమానాన్ని, పార్టీపట్ల నిబద్దతను చాటుకున్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement