Saturday, April 27, 2024

ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది: ప్రధానికి రఘురామ లేఖ

ఏపీ ప్రభుత్వం అర్హతకు మించి అప్పులు చేస్తోందంటూ ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెస్తోందని తెలిపారు. ఏపీ అప్పుల పాలై విలవిల్లాడుతోందని, తాహతుకు మించి అప్పులు చేయడం వల్ల రాష్ట్రం ఊబిలో చిక్కుకుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్‌డీసీకి బదలాయించి, రుణాలు సేకరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని తెలిపారు. 2020లో సగటున ప్రతి నెల రూ.9,226 కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. అందులో ఉచిత పథకాల కోసమే రూ.13 వేల కోట్లు తెచ్చారని తెలిపారు. ఉచిత పథకాలకు మరో 3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులను సంప్రదిస్తోందని వివరించారు. విశాఖలో కేటాయించిన భూములను దుబాయ్‌కి చెందిన లులు సంస్థకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎంపరిధిని మించి రాష్ట్రప్రభుత్వం అప్పులు చేశారని, దాని ఫలితంగా అప్పులకు వడ్డీ రూపేణా సుమారు రూ.35 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తోందని లేఖలో తెలిపారు

ఇప్పటికే ఏపీఎస్డీసీ పలు బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల మేర అప్పులు తీసుకుందని రఘురామ చెప్పారు. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్ల రుణాలకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమం ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని, కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులను కాపాడాలని రఘురామ విజ్ఞప్తి చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement