Sunday, April 28, 2024

AP: మడకశిరలో టీడీపీ అభ్యర్థిని మార్చాలని భారీ ప్రదర్శన.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

శ్రీ సత్య సాయి బ్యూరో, మార్చి 5 (ప్రభ న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాలంటూ మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే ఇతర కార్యకర్తలు స్పందించి అతను నిప్పు పెట్టుకోకుండా కాపాడగలిగారు. కాగా మడకశిర ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ పేరును అధిష్టానం మొదటి విడత 94 మంది అభ్యర్థులను ప్రకటించిన సమయంలోనే ప్రకటించడం జరిగింది. అప్పటినుంచి కూడా నియోజకవర్గంలో రోజుకు ఒక తరహాలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం పెనుకొండ సమీపంలో కియా వద్ద జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా సభకు అభ్యర్థి సునీల్ కుమార్ వర్గం మాత్రమే వెళ్ళింది. గుండుమల తిప్పేస్వామి వర్గం హాజరు కాలేదు. ఇందులో భాగంగా వారు సమావేశం నిర్వహించి అభ్యర్థిని మార్చని పక్షంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసేది లేదని తీర్మానం చేశారు.

తాజాగా మంగళవారం నియోజకవర్గంలోని అనేక గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి మడకశిర పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీని మడకశిరలో కాపాడండి అంటూ వినతిపత్రం అందజేశారు. ర్యాలీలో మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. ఈ సందర్భంగా చంద్ర అనే వ్యక్తి పెట్రోల్ తో కూడిన డబ్బా వెంట తెచ్చుకొని ఒక్కసారిగా ఒంటిపై పోసుకున్నాడు. వెంటనే అగ్గిపెట్టె తీసి వెలిగించుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో సహ కార్యకర్తలు స్పందించి వెంటనే అతని ఒంటిపై ఉన్న పెట్రోలును తుడిచి కాపాడారు.

ఈ సందర్భంగా టీడీపీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ…. అభ్యర్థి విషయంలో అధిష్టానం ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. సునీల్ కుమార్ పై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని, అభ్యర్థి మార్చాల్సిన అవసరం ఉందని అధినేతకు సూచించామన్నారు. కానీ ఆయన పట్టించుకోకపోవడంతో చేసేది లేక కార్యకర్తలు ఆందోళనలకు దిగారని, ఈ విషయంలో తాను చెప్పినప్పటికీ కూడా కార్యకర్తలు ఎవరూ వినడం లేదన్నారు. ఇంత వ్యతిరేకత ఉన్న అభ్యర్థికి భవిష్యత్తులో ఎన్నికలలో పార్టీ తరఫున ఎలా పని చేస్తారని అధిష్టానం పునరాలోచించి, మడకశిర నియోజకవర్గంలో టీడీపీని రక్షించాలని, లేనిపక్షంలో పార్టీ మనుగడకే ప్రమాదం ఉందని తిప్పేస్వామి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement