Saturday, May 4, 2024

ఉచిత విద్యుత్‌కు దీర్ఘకాలిక ప్రణాళిక.. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహం

అమరావతి, ఆంధ్రప్రభ : వ్యవసాయరంగానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ అందించే ప్రణాళికలో భాగంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రాజెక్టుల స్థాపన కోసం భూములిచ్చిన రైతులకు ప్రతి ఏటా లీజు చెల్లించటంతో పాటు వ్యవసాయానికి విద్యుత్‌ కొరత రాకుండా వివిధ కంపెనీలతో కాల వ్యవధి, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పరిమాణాన్ని నిర్దేశించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ప్రత్యేకించి వర్గాలపై, భూగర్భజలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంతానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు బహుళ ప్రయోజనాలు కలిగిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

నిరుపయోగ భూములను లీజుకివ్వటం ద్వారా ప్రతి సంవత్సరం కంపెనీల నుంచి రైతులకు ఎకరానికి రూ 30 వేలు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి రెండేళ్లకు లీజును అయిదు శాతం పెంపుదల చేసి రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు నంద్యాలలో మూడు ఇంధన ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇటీవలనే వర్చువల్‌ విధానంలో శంఖుస్థాపన చేశారు. మూడు ప్రాజెక్టులు విలువ రూ 25,850 కోట్లు.

దీనిలో 2,300 మెగావాట్ల సామర్యంతో గ్రీన్‌ కో కంపెనీ నిర్మించే సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఉంది.10,350 కోట్లు పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2 వేల మందికి పైగా ఉపాధి పొందే అవకాశం ఉందని అంచనా. 1,014 మెగావాట్ల సామర్ధం తో ఆర్సిలర్‌ మిత్తల్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ మరో ప్రాజెక్టు నిర్మిస్తోంది. రూ 4500 కోట్ల పెట్టుబడి తో 700 మెగా వాట్ల సోలార్‌ పవర్‌. 314 మెగా వాట్ల విండ్‌ వపర్‌ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మందికిపై ఉపాధి సమకూర్చనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

ఎకోరస్‌ ఎనర్జీ 2,000 మెగా వాట్ల సామర్థంతో మరో ప్రాజెక్టు నిర్మించనుంది. 1000 మెగా వాట్ల సోలార్‌, 1000 మెగా వాట్లు విండ్‌ పవర్‌ ఎనర్జీ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టును రూ.11 వేల కోట్లతో నిర్మిస్తుండగా దీని ద్వారా సుమారు రెండు వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు అంచనా. వీటితో పాటు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ఎన్‌ హెచ్‌ పీసీ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2,000 మెగా వాట్ల సామర్థంతో రూ. 10,000 కోట్లు పెట్టు బడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు రెండు వేల మందికి ఉపాధి లభించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

పునరుత్పాదక ప్రాజెక్టులకు సహకారం అందించే రైతుల ప్రయోజనాలు కాపాడేలా కంపెనీలతో చట్టబద్ధంగా పకడ్బందీగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త ఒప్పందాల వల్ల రైతులకు మరో 30 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్‌కు ఢోకా ఉండదు. పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా కొనసాగించేందుకు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఏజెన్సీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ)తో యూనిట్‌ కు రూ. 2.49 కే ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement