Thursday, May 16, 2024

AP | ఒక్క చాన్స్ అన్న‌ జ‌గ‌న్.. రాష్ట్రానికి ద్రోహం చేశాడు: ప‌వ‌న్

వైసీపీ అధికారంలోకి రావడం మంచిదే అయిందని.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జ‌గ‌న్ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేయగలడో ప్ర‌జ‌లందరికీ అర్థమైందని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు రాక ఎంతో మంది వేదనకు గురవుతున్నారని, రాష్ట్రంలో 18 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నప్పటికీ మెగా డీఎస్సీ ఇవ్వలేదని, పోలీసు ఉద్యోగాల ఖాళీలను కూడా భర్తీ చేయలేదని పవన్ ఆరోపించారు. ఆ రోజున వైసీపీకి ఓటేయకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నాం. మూతపడిన స్కూళ్లను తిరిగి తెరిపించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. అందుకు బలమైన, సుస్థిర రాజకీయ వాతావరణం ఉండాలి అని అన్నారు.

వైఎస్ జగన్, వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి… కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటాడు… దోపిడీ చేసేవాడుంటే ఆ దోపిడీని నిలువరించే వాడు ఉంటాడు… అడ్డగోలుగా మీరు దాడులు చేస్తుంటే తిరగబడేవాడు ఉంటాడు… కాలం అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది. నేను బతికుండగా ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజల ఐక్యతకు, భారతదేశ సమగ్రతకు అన్యాయం జరగనివ్వను, భంగం కలగనివ్వను అని ప‌వ‌న్ అన్నారు. మడ అడవులను కొట్టేస్తున్నా ఎవరం ఏమీ చేయలేకపోతున్నాం… యంత్రాంగం ఏం చేస్తోంది? ఎంత మట్టి తింటారు? ఎవరైనా సరే భూమికి బాకీ ఉంటాడు అని తెలంగాణలో ఒక సామెత చెబుతారు. మట్టిని తినేవాళ్లకు చెబుతున్నా… వైసీపీ వాడైనా సరే… మీరు చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే…. ఎక్కడికీ వెళ్లలేరు మీరు అని హెచ్చిరించారు.

జ‌గ‌న్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాలి అని అన్నారు. ఈ చట్టం మీకు మంచి చేస్తుందని జగన్ ఈ మధ్యన చెబుతున్నాడు. జగన్ ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్న వ్యక్తి. జగన్ కు ఈ చట్టంలో లాభదాయకంగా కనిపించింది. ఏ హక్కులు లేకుండానే మన ఇళ్లలోకి వచ్చి ఆస్తులు లాగేసుకుంటున్నారు. నిన్ను ఎలా నమ్ముతాం జగన్? అని ప్ర‌శ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మనం ఒప్పుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టవుతుంది” అంటూ పవన్ ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement