Monday, April 29, 2024

మాతృభాషతోనే సంతృప్తి : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం : మాతృభాషలో మాట్లాడటంలో ఉండే సంతృప్తి ఇక ఏ భాషలో మాట్లాడినా రాదని, మాతృభాషలు మృతభాషలుగా మారిపోతున్న వేళ.. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం తప్పక ఆచరించి మన మాతృ భాష తేట తెలుగు తీయదనాన్ని అందరికీ తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక కలెక్టరేట్ ప్రాంగణం స్మృతి వనంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద వెలుగు ఫౌండేషన్ చందమామ బాబు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. ముందుగా అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భాష కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదని, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుందన్నారు. సమాజం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని అయితే, భాషలు క్రమేపి అంతరించిపోతున్నాయని భాష కనుక అంతరించిదంటే.. ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలన్నారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారన్నారు. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదని ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు కానీ, వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, వెలుగు ఫౌండేషన్ చైర్మన్ చందమామ బాబు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు తల్లి విగ్రహం దగ్గర వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలవేసి మాతృభాష గొప్పదనం తెలుగు భాష తియ్యదనం తెలుగే ఒక మూలధనం అన్నారు తెలుగు భాషని బతికించు కొనడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి సీఈవో శ్రీనివాస్ చందమామ బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement