Saturday, April 27, 2024

Spl Story | ఏపీ రాజకీయాలలో ప్రబలశక్తిగా ‘జనసేన’.. సామాజిక మార్పుకోసం సప్త సిద్ధాంతాలు

“ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చాను … బలమైన రాజకీయ వ్యవస్థ వుండాలని వచ్చాను … నాతో కలసి ప్రయాణం చేయడానికి మీరు సిద్ధమా?” అని జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ‘తెలుగు’ రాజకీయాలలో ఒక ప్రకంపన సృష్టించింది. తెలుగునాట రాజకీయ యవనికపై ఆదిలో అస్పష్టంగా ఉన్న ‘జనసేన’ చిత్రం ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక నిర్ణయాత్మక శక్తిగా రూపుదిద్దుకున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేన సత్తాను తెలుగు ప్రజానీకానికి పరిచయం చేసే దిశగా పవన్ కళ్యాణ్ మెరుగులు దిద్దుతున్నారు.

– ఆంధ్ర‌ప్ర‌భ‌ వెబ్ ప్రతినిధి, గుంటూరు

పవన్ కళ్యాణ్… తెలుగు చలనచిత్ర రంగంలో అశేష ప్రేక్షకాభిమానాలు చూరగొన్న మెగా హీరో. మాయలు, మంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు తెలియని, కల్మషమెరుగని బోళాశంకరుడు. తెలుగుచిత్రసీమలోని అగ్రహీరోలలో ఒకరుగా వెలుగొందుతూనే రాజకీయ యవనికవైపు దృష్టి సారించారు. ఒక కళాత్మక చిత్రాన్ని రూపొందించిన రీతిలో ఉన్నత విలువలతో కూడిన ఒక సరికొత్త చిత్రాన్ని రాజకీయ యవనికపై ఆవిష్కరించేందుకు తపన పడుతున్నారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. తాను రాజకీయాలలోకి వచ్చింది అధికారం కోసం కాదు. ప్రజల పక్షాన ప్రశ్నించటానికి అని ఘంటాపధంగా స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ తన ధీరోదాత్తత ప్రదర్శించారు.

రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నది వాటి మేనిఫెస్టోల ద్వారా ప్రజలకు తెలియ పరుస్తుండటం సహజం. అయితే జనసేన రాజకీయ పార్టీల సహజ మేనిఫెస్టోల కు విరుద్ధంగా సామాజిక అంశాలను తమ పార్టీ మూల సిద్ధాంతాలుగా పెట్టుకొని ఒక వినూత్న ఒరవడికి మార్గదర్శి అయింది. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, అవినీతిపై రాజీలేనిపోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సప్త సిద్ధాంతాలను ప్రజలముందుంచింది.

కేవలం అభివృద్ధి, సంక్షేమంతోనే తాము ఆశిస్తున్న సామాజికమార్పు రాదని విశ్వసించిన జనసేనాని ఈ సప్త సిద్ధాంతాలతో రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తుండటం అభినందనీయమే. రాజకీయ పార్టీలు ప్రజాకర్షక పధకాలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ప్రజలను అంతగా ఆకర్షించని సప్త సిద్ధాంతాలతో రాజకీయం చేయటం ఒకవిధంగా సాహసోపేతమేనని చెప్పవచ్చు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకంటే సామాజిక మార్పు ద్వారానే ఉత్తమ సమాజ నిర్మాణం జరుగుతుందనే భావన పవన్ కళ్యాణ్ లో ద్యోతకమవుతోంది.

- Advertisement -

రాజకీయ లౌక్యం తెలియక జనసేనాని వైకుంటపాళిలో చిక్కి సతమతం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ను కేవలం ఒక కుల నాయకునిగా చిత్రీకరించాలనే ప్రయత్నాలు జరిగినప్పటికి, అవి విఫలం అయ్యాయి. కుల విషపుచట్రంలో చిక్కుకోకుండా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసింది. జనసేన ప్రారంభించిన తొలి రోజుల్లో చాలాగ్రామాలలో పవన్ కళ్యాణ్ చిత్రంతో ఫ్లెక్సీ లు, బ్యానర్లు వెలిశాయి. అయితే అవి ఏర్పాటు చేసిన వారు వారి పేర్లతో పాటు వారి సామాజికవర్గాన్ని సూచించే సంఘాల పేర్లను జోడించటం కన్పించింది.

దీంతో ఇతర సామాజిక వర్గాలలో జనసేన పట్ల అంతగా ఆసక్తి కలగలేదు. సామాజికవర్గ ప్రచారమే ‘జనసేన’ కు తొలిరోజుల్లో కొంత ప్రతిబంధకంగా మారిందని అంగీకరించక తప్పదు. కులాభిమానం వుండటంలో తప్పులేదు. ఒక నాయకునికి కులం బలం వుండటం అవసరమే. అయితే ఆ నాయకుడిని కులచట్రంలో బిగించటం హర్షణీయం కాదు. ఆ నాయకుని రాజకీయ ఎదుగుదలకి అది ప్రతిబంధకం అయ్యే ప్రమాదం వుంటుంది. ఇప్పుడవిధమైన ప్రమాదాలను అధిగమించి పవన్ కళ్యాణ్ జనసేనానిగా అన్నీ వర్గాలకు ఇష్టుడయ్యారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తో జత కట్టేందుకు అన్నీ రాజకీయ పార్టీలు పరితపిస్తుండటమే అందుకు నిదర్శనం.

జనసేనాని ప్రస్తుతం బిజెపితో కలసి తన రాజకీయ పయనం సాగిస్తున్నారు. అయినప్పటికి తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం జరుపటం అభినందనీయం. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే విషయంలో బిజెపి నాయకులలో కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ బహిరంగంగా మద్ధతు పలికారు. విశాఖ వుక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని జనసేనాని బహిరంగానే తప్పుబట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటుపరం కాకుండా చూసేందుకు పోరాటం జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేపట్టే ప్రజావ్యతిరేక చర్యలను బహిరంగానే ప్రశ్నిస్తున్నారు.

ఒక్కో సందర్భంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా రాష్ట్రంలో అధికార పార్టీలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బిజెపి తో కలసి పయనిస్తున్నందున విశాఖ ఉక్కు విషయంలో తన వైఖరి ఆ పార్టీకి ఆగ్రహం తెప్పిస్తుందన్న సంకోచం జనసేనానిలో ఏ కోశానా కానరావటం లేదు. అధికారం కోసం కాకుండా తాను నమ్మిన సామాజిక మార్పుకోసమే జనసేనాని నిబద్ధతతో వున్నారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపి ని గద్దె దింపాలనే లక్ష్యంతో రాజకీయ పునరేకీకరణ ప్రారంభం అయింది. సరికొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. పొత్తు పొడిచేందుకు సమయం ఆసన్నం అయిందన్న సంకేతంగా ఘంటానాదాలు వింపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే వైసీపీయేతర పార్టీల మధ్య పొత్తుకు జనసేనాని కేంద్ర బిందువయ్యారు. ఇప్పుడు ఆ పార్టీల ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. వైసీపీని ఢీ కొట్టాలంటే ఇప్పటికే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశంతో జత కట్టలా? లేక బిజెపి తోపాటు ఇతర పార్టీలను కలుపుకొని మూడవ ప్రత్యామ్నాల్యంగా ఎన్నికలకు వెళ్లలా? అనే సందిగ్ధత వున్నది. బహుముఖ పోటీలు జరిగిన సందర్భాలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి సహజంగానే అధికారపార్టీ లబ్దిపొందే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.

ప్రధాన ప్రతిపక్షంలో కలసి పోటీ చేస్తే అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వటమే గాక అధికారపుటంచులు తాకే అవకాశం వుంటుంది. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో చాలా చోట్ల తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అగ్రనాయకత్వంతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో వివిధ స్థాయిలలో లోపాయికారీ ఒప్పందాలు జరిగాయి. కొన్ని చోట్ల బహిరంగానే కలసి పోటీ చేశారు. వాటిల్లో చాలావరకు సత్ఫలితాలు పొందారు. వీటిని పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల కార్యకర్తల అభిప్రాయాలు ఏవిధంగా వున్నాయో అవగతం అవుతున్నది. పొత్తుల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల అనుభవాలను సైతం అన్నీ పార్టీలు పరిగణలోకి తీసుకునే అవకాశం వుంది.

జనసేన పార్టీ తో పొత్తు పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా ఒకకార్యకర్త జనసేనతో పొత్తు విషయాన్ని ప్రస్తావించారు. అందుకు చంద్రబాబు సమాధానిమిస్తూ లవ్ అనేది వన్ సైడ్ వుండకూడదు, రెండు వైపులా వుండాలి అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి జనసేనతో పొత్తుపై తెలుగుదేశం పార్టీ నర్మగర్భంగా సానుకూలసంకేతాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేనాని లేదా ఆ పార్టీ శ్రేణుల నుంచి ఏ విధమైన ప్రతికూల ప్రకటన వెలువడలేదు. అయితే బిజెపి నాయకులు చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీతో జత కట్టేందుకు బిజెపి ఏ మేరకు సుముఖంగా వుంటుందోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

అటువంటి పరిస్తితి తలెత్తితే బిజెపి తో తెగతెంపులు చేసుకుని జనసేన స్వతంత్రంగా నిర్ణయం గైకొంటుందా? లేక ఆ రెండు పార్టీలు ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేస్తాయా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు పొత్తులపై సమయం వచ్చినప్పుడు చెబుతాను అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ, పొత్తులతోనే ముందు వెళ్లగలదన్న సంకేతం ఇచ్చినట్టు అయింది. ఇప్పటికే రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా వున్న జనసేన వైఖరి రానున్న ఎన్నికలలో కీలకంగా మారనున్నది అనటంలో సందేహం లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement