Monday, May 6, 2024

AP: కుటుంబంలో చీలిక పాపం జ‌గ‌న్ దే …ష‌ర్మిల

అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనేనని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో నేడు ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ స‌మావేశంలో స్పందించారు.

‘‘కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న. దేవుడే గుణపాఠం చెప్తారట. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే కారణం జగన్ అన్నే. ఇవాళ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నే. దీనికి సాక్ష్యం దేవుడు… దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం.

జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే.. 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే…. అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి… ఎండనక, వాననక రోడ్ల మీదనే ఉన్న. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా.

- Advertisement -

తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు..

” గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. వైఎస్సార్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్న. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపీలో బీజేపీ రాజ్యం ఏలుతుంది. జగన్ ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారు. 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా హోదా అడగలేదు. రాష్ట్రంలో ఇప్పుడు హోదా ఆన్న అంశమే లేదు’’ అంటూ షర్మిల తనదైన శైలిలో అన్న జగన్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు పోలవరమని షర్మిల తెలిపారు. వైఎస్‌ సీఎం అయిన 6 నెలల్లోనే శంకుస్థాపన చేశారని దానిని ఇంత వ‌ర‌కు ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని జ‌గ‌న్ ను ఆమె సూటిగా ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement