Sunday, May 12, 2024

మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ స్టేడియంల‌ నిర్మాణం.. థామస్‌ కప్‌ విజేతలకు సీఎం సమక్షంలో సన్మానం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల కోసం అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం కోసం రోడ్‌ మ్యాప్‌ రూపొందించనున్నట్లు ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కొత్త అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ తెలిపారు. దేశంలో క్రికెట్‌ తర్వాత బ్యాడ్మింటన్‌కు అత్యంత ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. థామస్‌ కప్‌ విజయవంతో బ్యాడ్మింటన్‌ ప్రతిష్ట కొత్త స్థాయికి చేరిందన్నారు. కొత్త కమిటీ ప్రకటన తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత మౌళిక సదుపాయాల కల్పన కొరత ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి నేతృత్వంలో మౌళిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి స్టేడియంల నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తామని చెప్పారు.

బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ల ప్రయోజనాల కోసం మరిన్ని టోర్నీలను షెడ్యూల్‌ చేయడంపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్‌ ఆటను ప్రోత్సహించేందుకు అన్ని జిల్లాల్లో కోచ్‌ల నియామకానికి ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరి మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా రెండున్నరేళ్ల నుంచి సాధారణంగా క్రీడలు, మరీ ముఖ్యంగా బ్యాడ్మింటన్‌ చాలా నష్టపోయిందన్నారు. టోర్నమెంట్‌లను రద్దు చేయడంతో క్రీడాకారులు తీవ్రంగా దెబ్బతిన్నారని తెలిపారు. టోర్నీలను రద్దు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు క్రీడాకారులు తమ జాతీయ ర్యాంకింగ్‌ను పెంచుకోవడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. జులై నుంచి కోచింగ్‌ క్యాంపుల నిర్వహణకు సంబంధించి క్యాలెండర్‌ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. గ్రామాలకు ఆటను పెద్దఎత్తున తీసుకెళ్లేందుకు తమ కార్యవర్గం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. పురుషులు, మహిళలతో పాటు అండర్‌-12,13,15,17,19 వయస్సు వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు- ఆయన తెలిపారు. థామస్‌ కప్‌ గెలిచిన భారత జట్టులో భాగమైన గుంటూరుకు చెందిన కిడాంబి శ్రీకాంత్‌, శ్రీకాకుళానికి చెందిన సాయి సాత్విక్‌, కృష్ణ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సన్మానించనున్నట్లు ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement