Tuesday, May 7, 2024

‘యాస్’ ఎఫెక్ట్: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. తీరంలో అలజడి

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను తీరం దిశగా దూసుకువస్తోంది. ప్రస్తుతం యాస్ ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయదిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. యాస్ తుపాను రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా, ఆపై అతి తీవ్ర తుపానుగా బలపడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. యాస్ తుపాన్ ప్రభావంతో రెండు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారిందని వెల్లడించింది.

తుపాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడి ఉంటుందని వెల్లడించారు. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలో అలలు 2.90-4.5 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడతాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఈ తుపాను రాబోయే 12గంటల్లో తీవ్ర తుపానుగా మారుతోందన్నారు. ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈనెల 26న పారాదీప్, సాగర్ దీవి వద్ద తీరం దాటనుందని అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement