Monday, May 13, 2024

గుంటూరు లో 25 నుంచి రాత్రి కర్ఫ్యూ

22నుంచి వ్యాపారవేళల కుదింపు
ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే అనుమతి
ఉన్నతస్థాయి సమీక్షలో అధికారుల నిర్ణయం

గుంటూరు – కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో వుంచుకొని గుంటూరు నగరంలో ఈ నెల 25 వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు జరుపాలని నిర్ణయించారు. ఈనెల 22 వ తేదీనుంచి వ్యాపార వేళలను సైతం కుదించారు. వ్యాపార వాణిజ్య సంస్థలు అన్నీ ఈనెల 22 వ తేదీనుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలవరకే తెరచి వుంచాలని నిర్ణయించారు. గుంటూరు నగర మేయర్ కావటి శివనాగమనోహర నాయుడు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, అర్బన్ జిల్లా ఎస్పీ ఎన్ ఆర్ అమ్మిరెడ్డి, గుంటూరు ఆర్డీవో భాస్కర రెడ్డి, తూర్పు, పశ్చిమ ఎమ్మేల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో నగరంలో నెలకొన్న పరిస్థితిపై సమీక్ష జరిపారు. అనంతరం 25 నుంచి పూర్తిస్థాయిలో రాత్రి కర్ఫ్యూ అమలు జరుపటంతో పాటు, 22 వ తేదీ నుంచి వ్యాపారవేళలు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు.

ప్రజల ఆరోగ్యం కోసమే … మేయర్
ప్రస్తుత విపత్కర పరిస్తితులను దృష్టిలో వుంచుకొని ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్టు నగర మేయర్ కావటి శివనాగ మనోహారనాయుడు వెల్లడించారు. నగరంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ప్రజా సహకారంతోనే వాటిని కట్టడి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అవసరమైన పక్షంలో ప్రజలు డబుల్ మాస్కూలు ధరించాలని సూచించారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏవిధమైన లక్షణాలు కనిపించిన వార్డు వాలంటీర్ లేదా ఏ ఎన్ ఏం ద్వారా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ఆయన చెప్పారు.

కటిన చర్యలు .. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి
కరోనా కట్టడి కోసం నిబంధనలు కటినంగా అమలు జరుపనున్నట్టు అర్బన్ జిల్లా ఎస్పీ ఎన్ ఆర్ అమ్మిరెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కటిన చర్యలు తీసుకొనున్నట్టు ఆయన హెచ్చరించారు. 25 వ తేదీనుంచి పూర్తిస్థాయిలో రాత్రి కర్ఫ్యూ అమలులో వుంటుందని ఆయన చెప్పారు. నగరంలో ఇప్పటికే మాస్క్ లు ధరించని వారినుంచి అపరాధ రుసుము వసూలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఛాంబర్ నిర్ణయానికి ఆమోదం .. కమిషనర్ అనూరాధ
వ్యాపార సంస్థలను ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పనిచేయాలని మూడు రోజుల క్రితం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించిందని కమిషనర్ చల్లా అనూరాధ చెప్పారు. మేయర్ అధ్యక్ష్తతన జరిగిన సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ అయిన ఆర్డీవో సమక్షంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని ఆమోదించినట్టు ఆమె తెలిపారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపించనున్నట్టు చెప్పారు. కరోనా పరీక్షలు చేయించుకున్నవారు ఆ ఫలితాలు వచ్చే వరకు బయట తిరగవద్దని ఆమె సూచించారు. అత్యవసరమైన పనులు ఉన్న పక్షంలోనే ప్రజలు బయటకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో ఆర్డీవో భాస్కర రెడ్డి మాట్లాడుతూ గతం తో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా ప్రమాదకరంగా తయారయిందన్నారు. దీన్ని దృష్టిలో వుంచుకొని అధికారులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన అనంతరం నిబంధనలు అమలులోకి వస్తాయని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగువిధంగా చర్యలు చేపట్టనున్నట్టు ఆయన హెచ్చరించారు. గుంటూరు తూర్పు యం.యల్.ఏ. ముస్తఫా మాట్లాడుతూ వేగంగా పెరుగుతున్న కరోనాని కట్టడి చేయకుంటే భారి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ముస్లిం సోదరులు సైతం రంజాన్ ప్రార్ధనల సమయంలో మసీదుల వద్ద ఎక్కువ సంఖ్యలో గుమి కూడ వద్దని కోరారు.
గుంటూరు పశ్శిమ ఎం.యల్.ఏ. మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ నగరంలో కోవిడ్ కేసుల పెరుగుదల అందోళనకరంగా ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.సమావేశంలో అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి, డి.సి.పి.లు సత్యనారాయణ, హిమ బిందు, యస్.ఈ. రవి కృష్ణ రాజు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, యం.హెచ్.ఓ. డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement