Thursday, March 30, 2023

మత్తు మాఫీయాకు ఖద్దరు అండ.. నిఘా విభాగాలు ఇప్పటికైనా దృష్టిసారించేనా..

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో : ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా నిషేధిత గుట్కా, ఖైనీ, పాన్‌పరాగ్‌ వంటి మత్తు పదార్ధాల మాఫీయా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లా కేంద్రాలతో పాటు, మున్సిపల్‌ పట్టణాలు, మండల కేంద్రాలు, చివరకు గ్రామాల్లో సైతం యధేచ్చగా విక్రయాలు కొనసాగుతున్నాయి. గతంలో గుంటూరు కేంద్రంగా కొందరు ముఠాగా ఏర్పడి గుట్కా మాఫీయాను నిర్వహించేవారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు గుట్కా తయారీ… రవాణాలో కీలక పాత్రదారులుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గుట్కా వ్యవహారంలోనే గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఎస్పీ సైతం బదిలీ అయ్యారు. అధికార పార్టీ అండదండలతో యధేచ్చగా కొనసాగుతోన్న ఈ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు నిఘా విభాగాలు సైతం జంకుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన తర్వాత పల్నాడు జిల్లాకు సైతం తమ వ్యాపారాలను విస్తరించినట్లు సమాచారం. ఎవరైనా సమాచారం ఇస్తే నామమాత్రపు కేసులతో సరిపుచ్చుతున్నారన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అక్రమ గుట్కా వ్యాపారం ముసుగులో వివిధ ప్రభుత్వశాఖల్లోని కొందరికి లక్షల్లో ముడుపులు చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిషేధాఘ్నలు పెడచెవినపెట్టి… ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు తమ అక్రమార్జనకు తెరతీస్తున్నారు. గుంటూరుజిల్లాతో పాటు పల్నాడు జిల్లాలోని కొన్ని మున్సిపల్‌ పట్టణాలను కేంద్రంగా కోట్ల విలువచేసే నిషేధిత గుట్కా, పాన్‌పరాగ్‌, ఖైనీ అక్రమంగా తరలిస్తూ గుట్టూగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. నిషేధం కొనసాగుతున్నప్పటికీ లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని యధేచ్చగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమార్గంలో నిషేధిత సరుకును రాష్ట్రంలోకి దాటిస్తూ.. జిల్లాలోని ముఖ్యపట్టణాలకు తరలించి తమ డీలర్ల ద్వారా గుట్టుగా విక్రయాలు చేయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.

పాన్‌షాపుల్లో గుట్టు గా విక్రయాలు..

- Advertisement -
   

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కా, పాన్‌పరాగ్‌, ఖైనీ విక్రయాలు గుట్టు గా కొనసాగిస్తున్నారు. పాన్‌ దుకాణాలు, కిరాణా, బడ్డీ బంకుల్లో అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా అనుబంధ పదార్థాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆ దిశగా నిఘా విభాగాలు దృష్టిపెట్టిన దాఖలాలు కన్పించడంలేదు. వాహనతనిఖీల్లో భాగంగా పోలీసులకు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో నిషేధిత గుట్కా భారీగా రవాణా చేస్తూ పట్టుబడుతున్నాయి. గుంటూరు కేంద్రంగా తిరిగి గుట్కా మాఫీయా తమ కార్యకలాపాలకు తెరలేపిందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నగరంలో అయితే పాన్‌ షాపుల్లో యధేచ్చగా విక్రయాలు చేస్తున్నా…పట్టించుకునే పరిస్థితులు కన్పించడంలేదు.

లోపిస్తున్న నిఘా…

నిషేధిత గుట్కా అనుబంధ పదార్థాల నియంత్రణలో నిఘా లోపిస్తుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిషేధిత సరుకు ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా అవుతోందన్న సమాచారం అందుతున్నా సకాలంలో సంబంధిత అధికారులు స్పందించడంలేదన్న విమర్శలు సైతం లేకపోలేదు. గుట్కా నిషేధంపై పటిష్టమైన నిఘా కొనసాగించకపోతే ముఖ్యంగా యువత దీని బారిన పడి ఆరోగ్యం పాడుచేసుకునే ప్రమాదం ఉంది. గుట్కా వ్యసన పరులు కాన్సర్‌ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నా అలవాటు మాత్రం మానలేకపోతున్నారు. గుట్కా..పాన్‌పరాగ్‌, ఖైనీ వంటి విషపూరితాలకు దూరంగా ఉండాలని వైద్యుల హెచ్చరికలను సైతం యువత పెడచెవినపెడుతోంది. నిఘా విభాగాలు ఇప్పటి-కై-నా నిషేధిత గుట్కా అనుబంధ విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement