Tuesday, May 14, 2024

గృహ నిర్మాణశాఖపై జగన్‌ సమీక్ష – సీఆర్డీయేలో ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆదేశం…

అమ‌రావ‌తి – సీఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలని కోరారు. గృహనిర్మాణశాఖపై సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గడిచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ, ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పేదలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంత బాగుపడతాయని సీఎం అన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు చేశామన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు పలు శాఖల అధికారులు, స్పెషల్ సీఎస్ లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement