Monday, April 29, 2024

అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?

మానవపాడు, మే 18 (ప్రభ న్యూస్) : ఆ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ టికెట్‌ కోసం ఆశావాహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక కార్యకర్తల అభిమానాన్ని సంపాదించే ప్రయత్నాలలో కొందరు లీడర్లు ఉండగా రాష్ట్ర స్థాయి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో మరికొందరు ఉన్నారు. ఉత్కంఠ నెలకొన్న అలంపూర్ నియోజకవర్గంలో సీట్లు ఆశిస్తున్న లీడర్ల కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో ఎలక్షన్‌ మూడ్ రావడంతో అన్ని పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్‌ ఆశించే ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ కే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా బీఆర్ఎస్ టికెట్‌ సాధించాలని ఆశావాహులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ప్రజాదరణ పొంది, భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే అబ్రహం ఇసారి కూడా టికెట్‌ తనకే వస్తుందన ధీమాతో సైలెంట్‌ గా తన పని తాను చేసుకుపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మందజగన్నాధం కూడా తన కుమారుడు మందశ్రీనాథ్ ను ఈసారి బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ దక్కించుకునేందుకు పార్టీ అధినేతతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు సమాచారం. బండారు భాస్కర్ సైతం అలంపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర గిడ్డంకుల చైర్మన్ సైతం బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నాడు. ఇక్క‌డి నాయకులతో రెగ్యులర్‌ గా టచ్‌ లో ఉంటూ టికెట్‌ దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్.కిషోర్ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర నాయకుల మెప్పు పొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గెలిచే సత్తా మాకు ఉందంటూ ఎవరికి వారు అధిష్టానానికి సంకేతాలు చేరవేసి సీటు సాధించుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. వీరేకాక కరుణసూరి, శ్రావణ్ కుమార్, ఆర్ వి శేషు లాంటి వారు అవకాశం వస్తే మేము కూడా సిద్దమే అంటూ సందేశాలను పంపిస్తున్నారు. ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి ఏ నేతకు ప్రజాదరణ ఉంటుందో వారికే టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు.

వివాదాలకు దూరంగా.. ప్రజా సేవలో ముందుండే అబ్రహం మరోసారి బరిలో నిలిచేనా..
అలంపూర్ నియోజకవర్గానికి అబ్రహం సిట్టింగ్‌ ఎమెల్యేగా ఉన్నారు. డాక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు అసెంబ్లీలో అధ్యక్ష అనే స్థాయికి ఎదిగారు. అలంపూర్ నుండి రెండు సార్లు గెలుపొంది 2009లో తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా, అప్పటి సమీప పార్టీ టీడీపీ ప్రసన్న కుమార్ పై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. వివాదాలకు దూరంగా ఉంటూ.. ప్రజాసేవలో ముందుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు అబ్రహం. అయితే ఈసారి అలంపూర్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు తన కుమారుడు అజయ్ ను బరిలో దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రికి అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్రత్యేక శ్రద్ధ..
అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి హామీ మాకే ఇచ్చారు. టికెట్ మాదే అంటూ కొందరు ప్రచారం చేసుకుంటూ ఆయన ఆశీర్వాదం ఉందటూ కొంత మంది ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రి సైతం అలంపూర్ నియోజకవర్గంలో ఇక్కడే స్థిరపడేందుకు, ఇక్కడి బలమైన నాయకుడిని బీఆర్ఎస్ లో పార్టీలోకి ఆహ్వానించడం, మానవపాడు, ఉండవెల్లి మండలాల్లో వ్యవసాయ పొలం కొనుగోలు చేయడం, మంత్రికి అలంపూర్ పై ఎంత మక్కువ ఉందో తెలుస్తుంది. తనకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకునేందుకే ప్రధానంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం.

- Advertisement -

స్థానికులకే ఎమ్మెల్యే టికెట్‌ దక్కాలి
స్థానికేతరులకు ఇక్కడ చోటు లేదని ఇతర ప్రాంతాల వాళ్లను పోటీకి దింపితే ఓడిపోవడం ఖాయం అని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా.. ఆయనకు తెలియపరచకుండా అలంపూర్ నియోజకవర్గంలో సాయి చంద్ పర్యటించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా మరికొందరు హెచ్చరిస్తున్నారు.

నాయకుల మధ్య కోల్డ్ వార్..
బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య వార్ తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో నాయకత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఆవశ్యకత అయితే ఉందని నియోజకవర్గ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నియోజకర్గంలో ఒక సారి 94లో ఇక్కడి ప్రజలు టీడీపీకి అవకాశం కల్పించిన ఆపార్టీ ఉనికే లేకుండా పోగా బీజేపీ పరిస్థితి అంతంతగానే ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో ఏది ఏమైనా ప్రతి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత ఓటు బ్యాంకు ఉన్నదన్న విషయం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఏర్పడిన వర్గ విబేధాలను గమనించి ఇక్కడి క్యాడర్ ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపితే బీఆర్ఎస్ పార్టీకి మొదటికే మోసం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. లీడర్ల మధ్య సయోధ్య లేనట్టయితే క్యాడర్ కూడా అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నది నిజం. లీడర్లలో నెలకొన్న పంచాయ‌తీలకు చెక్ పెట్టేందుకు అధినేత కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement