Thursday, May 9, 2024

నెల రోజుల్లో కోటి మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయాల్సిందే – టార్గెట్ ఫిక్స్ చేసిన జ‌గ‌న్

అమరావ‌తి : కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేపట్టాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అర్బన్‌ ఏరియాలలో స్థానిక ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ –19 వ్యాక్సినేషన్‌ ప్లాన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ఇంకా 3.97 లక్షల మందికి వ్యాక్సిన్‌ పెండింగ్‌లో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే 60 ఏళ్లకు పైబడి, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 59.08 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. దీంతోపాటు ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్లు పైబడ్డ వారందరికీ కూడా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్రం నిర్ణయం ప్రకటించిందని అధికారులు తెలిపారు. అనంతరం మొత్తంగా కోటిమందికిపైగా వ్యాక్సినేషన్‌ను శరవేగంగా ఇవ్వడానికి అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. దీనికోసం సన్నాహకంగా ప్రతి మండలంలో రోజుకు 2 గ్రామాల చొప్పున, వారానికి 8 గ్రామాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ చేయాలన్నారు. ఈ ప్రక్రియలో వస్తున్న లోపాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతమైన విధానాలను అమలు చేయవచ్చన్నారు. వారానికి 25 లక్షల చొప్పున నాలుగు వారాల్లో 1 కోటిమందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా సిద్ధం కావాలని ఆదేశించారు. కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని, దీనివల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. అధికార యంత్రాంగంలో సందిగ్ధ వాతావరణం ఉందన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? అన్న ప్రశ్న తలెత్తుతోందని ‌ జగన్‌ ఆవేదన చెందారు. ఏది ఏమైనా మనం చేయాల్సిన పని మనం చేయాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా విలేజ్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయి యాక్టివిటీగా గ్రామాల్లో చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్‌ వర్కర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజల్లో చైతన్యానికి మరింత ప్రచారం నిర్వహించాలన్నారు. వ్యాక్సిన్‌ అందరూ వేసుకుంటున్నారా? లేదా? అనేది అక్కడికక్కడే పరిశీలన చేయాలన్నారు. వారికి అవగాహన కల్పించి అప్పుడే వ్యాక్సిన్‌ ఇచ్చేలా చేయాలన్నారు. ‘పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత లేకుండా చూసుకోవాలి. 104లతో అనుసంధానంగా ఉన్న డాక్టర్ల సంఖ్య సరిపోతున్నారా? లేదా చూసుకోవాలి. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలి, ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. అలాగే ప్రతి మండలానికి రెండు 104 వాహనాలు ఉండాలి. ఒక్కో వాహనంలో ఒక్కో డాక్టరు ఉండాలి. ఈరకంగా మండలానికి 6గురు వైద్యులు ప్రతి మండలంలో ఉండాలి. నెలకు మూడు సార్లు ప్రతిగ్రామాన్నీ వైద్యుడు సందర్శించాలి. వైద్యుల నియామకంలో ఎలాంటి సంకోచాలు వద్దు. అవసరాలకు తగిన విధంగా డాక్టర్ల నియమాకాలు చేయాలి. దీనికి అవసరమైన నిధుల జారీలో ఎలాంటి అలక్ష్యం వద్దు’ అని సీఎం వైయస్‌ జగన్‌ ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement