Saturday, May 18, 2024

కలెక్షన్‌ కింగ్‌లు.. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో పోస్టింగ్‌కు ఓ రేటు..

అమరావతి, ఆంధ్రప్రభ: చేయి తడిపితేనే అక్కడ ఫైల్‌ కదులుతోంది. వైద్యుల సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ కు పదివేలు.. రీ పోస్టింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలన్నా, రెండు నెలలు పైబడిన లీవులు మంజూరు చేయాలన్నా.. ఉద్యోగులకు రావలసిన6,12,18,24 సంవత్సరాల ఇంక్రిమెంట్‌ లకు సైతం ఓ రేటు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యశాఖ లో ని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో అవినీతి రాయుళ్ళ ఆగడాలకు అంతుపొంతు లేకుండా పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విభాగం కింద పనిచేసే వైద్యులు, వైద్యేతర సిబ్బంది వివిధ పనులపై 26 జిల్లాల నుండి వస్తుంటారు. ఒక్కరోజులో పనులు పూర్తి కాకపోవడంతో దూరాభారం, వ్యయప్రయాసలు లెక్కేసుకొని పనులు సకాలంలో పూర్తి చేయమని సంబంధిత సిబ్బందికి ఎంతోకొంత తప్పని పరిస్థితులలో మామూళ్లు ఇస్తుంటారనేది బహిరంగ రహస్యం. అలా మొదలైన అలవాటు ఇటీవలి కాలంలో దందాగా మారిందనే అభియోగాలు వినిపిస్తున్నాయి.

పోస్టింగ్‌కు ఓ రేటు..

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతంలోని వైద్యులను ఆంధ్రా కు కేటాయించడంతో ఆంధ్రా పరిధిలోని ఖాళీలను అనుసరించి ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఇటీవల కౌన్సిలింగ్‌ నిర్వహించారు. స్టేషన్‌ ను బట్టి కౌన్సిలింగ్‌ల మామూళ్లు డిమాండ్‌ చేసినట్టు- అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. పోస్ట్‌ను బట్టి లక్ష రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేసినట్లు భోగట్టా. అంతా అధికారుల కనుసన్నల్లోనే జరగడంతో పోస్టింగ్‌ కోసం వచ్చిన ఉద్యోగులు మారుమాట్లాడకుండా లంచావతారాలు అడిగినంత ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సర్వీస్‌ మొత్తం మమ్మల్ని వాళ్ళు వెంటాడు తారు, వాళ్లు అడిగిన దాంట్లో ఏదో కొంత ఇచ్చి పని కానిచ్చుకొని వెళ్లడమే బెటర్‌ అని పలువురు ఉద్యోగులు అనడం కొసమెరుపు.

కలెక్షన్‌ ఏజెంట్లు..

డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరు, అవినీతి అధికారులకు కలెక్షన్‌ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కింది సిబ్బంది లంచాలు అడుగుతున్నారు అని అధికారులకు చెబితే మీరు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి విచారణ చేస్తా అంటున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఏ ఉద్యోగి కూడా రాష్ట్రస్థాయి కార్యాలయంలోని ఉద్యోగుల పై ఫిర్యాదు చేసే సాహసం చేయరు. ఎందుకంటే భవిష్యత్‌లో ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే భయం ఉంటుంది. నోటిమాట ద్వారా ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ధైర్యం చేసి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చిన సంబంధిత ఉద్యోగులపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఫిర్యాదు చేశాక విచారణల పేరుతో తరుచూ విజయవాడకు రావాల్సి ఉండటంతో పాటు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయ ఉద్యోగులతో గొడవ ఎందులే అని పలువురు ఉద్యోగులు మిన్నకుండిపోతున్నారని తెలుస్తోంది. కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్టవేసి వసూళ్ల దందా చెలాయిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ 6 విభాగాన్ని ప్రక్షాళన చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement